ఆంధ్రుల రాజధాని అమరావతి చరిత్ర

అమరావతి గుంటూరు జిల్లాలో కృష్ణానదీ తీరానికి కుడి వైపున ఉన్నది. ఈ పట్టణము వేల సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉన్నది. ప్రాచీన శాసనాల ప్రకారము ఈ పట్టణానికి ధాన్యకటకము అనే పేరు ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని పంచారామాలలో ఒకటైన అమరేశ్వరాలయము పేరు మీదుగా అమరావతి పేరు వచ్చింది. ఈ పట్టణము జైన, బౌద్ధ మతాలకు కూడా ప్రసిద్ధమైనది.


శాతవాహనులలో ప్రసిద్ధుడైన గౌతమీపుత్ర శాతకర్ణి మూలముగా  క్రీ.శ. ఒకటవ శతాబ్దములో ధాన్యకటకము ప్రసిద్ధిచెందినది. చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్ ఈ పట్టణములో నివసించి అచటి వైభవము గురించి ప్రశంసించాడు.


అమరావతి  ధరణికోట పరిసరములలో బృహత్ శిలాయుగపు సాంస్కృతిక అవశేషాలు లభించాయి. క్రీ. పూ 4-3 శతాబ్దాలనాటి నివాస ప్రదేశాలు, కట్టడాలు, స్థంభాలు వెలుగు చూశాయి. మౌర్యులకు పూర్వమే ఇచట నాగ, యక్ష తెగల జనపదం ఉండేదని తెలుస్తోంది. బౌద్ధ భిక్షువు, చరిత్రకారుడు తారనాథుని ప్రకారము గౌతమ బుద్ధుడు ధరణికోటలో కాలచక్ర మండలాన్ని ఆవిష్కరించాడు. బహుశా ఈ కారణము వల్ల బుద్ధుని మరణానంతరము అమరావతిలో గొప్పస్తూప నిర్మాణము జరిగివుండవచ్చును.


మౌర్యులు, సదవంశీయులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, అనంద గోత్రీయులు చాళుక్యులు, చోళులు, కోట వంశీయులు, కాకతీయులు, విజయనగర రాజులు, కుతుబ్ షాహి నవాబులు వరుసగా అమరావతి/ధరణికోట ను పాలించారు. క్రీ.శ. 4వ శతాబ్ది నుండి 15వ శతాబ్దము వరకు ధరణికోట ఆంధ్రదేశ రాజకీయ చరిత్రలో కీలకస్థానం వహించింది.



అమరావతిలో కల అమరేశ్వర ఆలయం కారణం గా ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. అంతేకాక, ఇక్కడ నిర్మించబడిన అతి పెద్ద బౌద్ధారామాల కారణంగా కూడా ప్రసిద్ధి కెక్కింది. ఈ బౌద్ధ స్తూపాలని మౌర్య సామ్రాజ్య స్థాపనకు ముందే నిర్మించారని విశ్వసిస్తారు. దీనిని అప్పట్లో ధాన్య కటకం లేదా ధరణికోట అని పిలిచేవారు. ఆంధ్ర పాలకులలో మొదటి వారైన శాతవాహనులకు సుమారు క్రి. పూ. 2 వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు వారి సామ్రాజ్యానికి రాజధానిగా వుండేది.


గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను అమరావతి లోనే బోధించాడు. అందువలన అమరావతి బుద్ధునికంటే ముందు నుండే ఉన్నదని నిర్ధారణ ఔతున్నది. దీనికి చారిత్రక ఆధారాలు వజ్రాయన గ్రంథంలో పొందుపరచబడి వున్నాయి. నేడు ఈ పట్టణం, అమరావతి స్తూపం , పురావస్తు మ్యూజియం వంటి ఆకర్షణల కారణంగా ఒక చక్కని పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది.


అమరేశ్వరాలయములో కొలువు దీరిన అమరలింగేశ్వర స్వామి. ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలలో ఒకటి. గర్భాలయంలో 15 అడుగుల ఎత్తులో పొడవుగా ఊన్న మహా శివలింగం దంతం రంగులో ఉంటుంది. ఈ శివలింగం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో తలపై మేకు కొట్టినట్టు చెబుతారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపిస్తూ వుండటం విశేషం.


ప్రతి యేటా విజయదశమి రోజున మహా శివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ స్వామివారికి  అమ్మవారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం జరిపించబడుతూ ఉంటుంది. చాముండికా సమేతుడైన అమరేశ్వరుడు ఇక్కడ విశేష పూజలను అందుకుంటూ ఉంటాడు. ఇక్కడి స్వామివారు త్రిగుణాలకు అతీతుడు అనే భావాన్ని ఆవిష్కరించేలా మూడు ప్రాకారాలతో ఆలయం కనువిందు చేస్తుంటుంది.


మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు . జ్వాలాముఖీ దేవి కనిపిస్తారు. మధ్య ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు ,కుమార స్వామి , ఆంజనేయ స్వామి ఉంటారు. ధ్వజ స్తంభం దగ్గరగా సూర్య భగవానుడు ప్రతిష్టితమై ఉన్నాడు.



శ్రీకృష్ణదేవరాయలు అమరావతిని సందర్శించి ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టు, పెదమద్దూరు గ్రామ పంటభూముల్ని ఆలయానికి దాన మిచ్చినట్టుగా ఇక్కడ ఉన్న రాజశాసనం తేటతెల్లం చేస్తోంది. కొండవీటి రెడ్డిరాజుల పై విజయానంతరం 1517లో చారిత్రక ప్రాంతం కృష్ణాతీరమైన అమరావతిని దర్శించిన కృష్ణదేవరాయలు ఇక్కడ తులా భారం తూగారు. తన బరువుతో సరిసమానమైన బంగారాన్ని పేదలకు పంచిపెట్టినట్టుగా శాసనంలో ఉంది.


అందుకు గుర్తుగా రాయలు నిర్మించిన తులాభార మండపం, దానిముందు వేయించిన శాసనం నేటికీ ఇక్కడ చెక్కుచెదర కుండా ఉన్నాయి. ఆలయంలోని దక్షిణ రెండో ప్రాకారంలో ఈ మండపం ఉంది. నేడు అమరావతి అమరేశ్వరునిగా కొలువందుకుంటున్న స్వామి నాడు ధరణికోట అమరేశ్వరస్వామిగా వెలుగొందాడని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: