త్వరలో టీడీపీలోకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి..! రాజంపేట పార్లమెంట్ నుంచి పోటీ..!!
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు వింటే చాలు.. సమైక్యాంధ్ర ఉద్యమం గుర్తొస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. విభజన బిల్లును అసెంబ్లీ నుంచి తిప్పిపంపిన ఘనత ఆయనదే. అయితే ఆయన కోరిక నెరవేరలేదు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికొచ్చి జైసమైక్యాంధ్ర పార్టీ స్థాపించారు. ఆయన మాత్రం పోటీ చేయలేదు కానీ ఆ పార్టీ తరపున పలువురు బరిలోకి దిగారు. అయితే ఎవరూ గెలుపొందలేదు. దీంతో రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు.
కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే వాటిని ఖండించడం కానీ, తిరస్కరించడం కానీ చేయలేదు. ఇటీవల ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆ పార్టీలో చేరతారనే ప్రచారం జరిగింది. సోదరుడు టీడీపీలో చేరుతున్నప్పుడు కానీ, ఆయన చేరికపై కానీ కిరణ్ కుమార్ రెడ్డి స్పందించలేదు.
కిశోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరడం వెనుక కిరణ్ కుమార్ రెడ్డే కీలక పాత్ర పోషించారనేది తాజా సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి సలహాలు, సూచనలు లేకుండా ఆయన కుటుంబసభ్యులెవరూ ముందడుగు వేయరు. కిషోర్ కుమార్ రెడ్డి కూడా అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకే టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా ఆయన పీలేరు నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి ఎలా వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి కూడా టీడీపీలో చేరి రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తాజా సమాచారం. ప్రస్తుతం రాజంపేట పార్లమెంటుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చాలాకాలంగా పెద్దిరెడ్డి కుటుంబంతో నల్లారి ఫ్యామిలీకి విభేదాలున్నాయి. ఇప్పుడు మరోసారి అదే జరగబోతోంది. మిథున్ రెడ్డిపై కిరణ్ కుమార్ రెడ్డి పోటీ ఖాయమని తెలుస్తోంది. సోదరుడు పోటీ చేసే పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్ పరిధిలోకే వస్తుంది. ఇది కూడా కిరణ్ కుమార్ రెడ్డికి కలిసొచ్చే అంశం.
ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మళ్లీ అసెంబ్లీకి పంపండం బాగోదని భావిస్తున్న చంద్రబాబు ఆయన్ను పార్లమెంటుకు పంపించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో తమ మిత్రపక్షం అధికారంలోకి వస్తే ఆయనకు మంత్రిపదవి కూడా కట్టబెట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టు సమాచారం. సో.. కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి పెద్దిరెడ్డి కుటుంబంతో ఢీకొట్టబోతున్నారు. అదీ అధికార టీడీపీ అభ్యర్థిగా..!!