రాజకీయం నల్లారి కుటుంబంలో ఎంత పని చేసిందో తెలుసా..?

Vasishta

 ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పీలేరులో మంచి పట్టుంది. దశాబ్దాలుగా నల్లారి కుటుంబం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే ఇప్పుడు ఆయన తమ్ముడు టీడీపీలో చేరడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఒంటరయ్యారు. పీలేరులో ప్రస్తుతం ఆయన ఫోటో కూడా ఎక్కడా కనిపించడం లేదు. సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో పట్టుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

 

రాష్ట్ర విభజనను నిర్ద్వందంగా వ్యతిరేకించినవారిలో కిరణ్ కుమార్ రెడ్డి ఒకరు. విభజన బిల్లును అసెంబ్లీలో తిప్పి పంపించిన ఘనత ఆయనదే. అయితే ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. విభజన తర్వాత జైసమైక్యాంధ్ర పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇన్నాళ్లూ అన్నతోనే ఉన్న సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇటీవల టీడీపీలో చేరారు. అప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది.

 

అన్నతో సంబంధం లేకుండా పీలేరు నియోజకవర్గంలో పాగా కోసం తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. తన పేరు వాడుకోవద్దంటూ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కిషోర్ కుమార్ రెడ్డి... ఎక్కడా అన్న పేరుకానీ, ఫోటోకానీ వాడకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్నతో సంప్రదించుకుండానే తన కార్యాచరణను అమలు చేస్తున్నారు. హైదరాబాద్ ను వదిలేసి పీలేరులోనే ఉంటూ కేడర్ కు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. అయితే అన్నదమ్ముల మధ్య పోరులో కేడర్ అయోమయానికి గురవుతున్నట్టు తెలుస్తోంది.

 

కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, అమరనాథరెడ్డి ఫోటోలు పెట్టుకుని ముందుకెళ్తున్నారు. జన్మభూమి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కుమారుడు నల్లారి అమర నాథ రెడ్డి భవిష్యత్ కోసమే సోదరుడితో విభేదించి మరీ సొంతంగా ఎదిగేందుకు కిషోర్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు ఆయన అనుచరులు చెప్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గరినుంచ జైసమైక్యాంధ్ర పార్టీ వరకూ అన్న వెంటే నడిచారు కిషోర్ కుమార్ రెడ్డి. ఇప్పుడు మాత్రం తన ఉనికి, తన కుమారుడి ఎదుగుదలకోసం కిషోర్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. దీంతో నియోజకవర్గంలో కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరమరుగైపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: