ఛీ..ఛీ..తల్లి అనే పదానికి మచ్చ తెచ్చింది..!

siri Madhukar
తల్లి అంటే దైవస్వరూపం..ఆ దేవుడు తనకు బదులుగా తల్లిని సృష్టించి లోకానికి ప్రసాదించారని అంటారు.  తన ప్రాణాలు పోసైనా తన బిడ్డలను కాపాడుకునేందుక ఏమాత్రం వెనుకాడని వారు ఎవరైనా భూమ్మిద ఉన్నారంటే..అది ఒక్క తల్లే అని చెప్పాలి. మాతృమూర్తి గురించి వర్ణించాలంటే..ఒక్క పదంలో సరిపోదు.  అలాంటిది ఓ తల్లి తన కన్న కొడుకును పాశవికంగా హతమార్చి ముక్కలుగా చేసింది..తల్లి అనే పదానికి మచ్చ తెచ్చింది.  ఈ ఘటన కేరళలోని కొళ్లాం జిల్లా నెడుంబనలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 

జితూ జాబ్ అనే 14 ఏళ్ల‌ త‌మ కుమారుడు 9వ తరగతి చదువుతున్న అతడు స్కేలు కొనుక్కోవడానికి వెళ్లి, కనిపించకుండా పోయాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పత్రికల్లో ప్రకటనలు కూడా వేయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం అన్వేషించగా, వాళ్లింటి సమీపంలోనే ఓ మృతదేహం ముక్కలు ముక్కలుగా పడి, కాలిపోయి ఉండటాన్ని గుర్తించారు. చివరికి ఆ మృతదేహం జితూదేన‌ని నిర్ధారించారు. తమకు శత్రువులెవరూ లేరని అత‌డి త‌ల్లిదండ్రులు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులే ఈ హ‌త్య చేసి ఉండొచ్చ‌ని పోలీసులు భావించారు. 

అయితే ఓ పోలీస్ అధికారి తల్లి కుడిచేతిపై ఉన్న కాలిన గాయాన్ని చూసి అనుమానించి విచారించడంతో అసలు నిజం బైటపడింది. జయమోల్ అనే ఈ కసాయి తల్లి జితూ జాబ్ అనే 14ఏళ్ల తన కొడుకుని పైట చెంగుతో గొంతుకు ఉరివేసి చంపేసింది. ఆ తర్వాత రాత్రి సమయంలో శవాన్ని సమీపంలోని తమకే చెందిన రబ్బర్ తోటల్లోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టింది. ఆ తర్వాత నుంచి తన కొడుకు తప్పిపోయాడంటూ దొంగ నాటకం ఆడింది. అయితే ఎందుకు హత్య చేసిందో మాత్రం నోరు విప్పడం లేదు.

అక్రమ సంబంధం గాని, లేదా మరేదైనా కారణంగాని హత్యకు దారి తీసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. హత్య రోజున కొడుకుతో జయమల్ గొడవ పడినట్లు తెలుస్తోంది. అయితే కన్నకొడుకును కిరాతకంగా చేతులు, కాళ్లు నరికి కాల్చేసేంతటి ఘోరానికి ఎందుకు తెగబడింతో పోలీసులకు అంతుచిక్కడం లేదు.ఈ హత్యలో మరొకరి ప్రమేయం ఉందని, విచారణలో అది వెల్లడి కాగలదని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు మృతుడి తండ్రి మాత్రం ఈ హత్యను కప్పిపుచ్చే విధంగా మాట్లాడుతున్నాడు. తన భార్యకు ఎవరైనా ఎగతాళి చేస్తే కోపమని, ఏం చేస్తుందో కూడా తెలియని విధంగా ప్రవర్తిస్తుందని, బహుశా కొడుకు హేళన చేశాడని, చంపేసి ఉంటుందని చెబుతున్న మాటలు పోలీసులు నమ్మడంలేదు. భార్య అక్రమ సంబంధ వ్యవహారాన్ని కప్పి పుచ్చేందుకే భర్త కూడా ఇలా మాట్లాడుతున్నాడని పోలీసులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: