చిన్న వ్యాపారస్తులకు మరో శుభవార్త..!

Edari Rama Krishna
చిన్న వ్యాపారస్తులకు వరం లాంటిది ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం. ప్రధాని నరేంద్ర మోడీ దీనిని ఆగస్టులో లాంఛనంగా ప్రారంభించారు. చిన్న సంస్థలకు, యువతకు ఉపాధి కోసం గత ప్రభుత్వాలు కూడా పథకాలు తెచ్చాయి. కానీ వాటి పరిమిత ప్రయోజనం కారణంగా ముద్ర యోజన తీసుకు వచ్చారు. ప్రతి ఏటా చదువుకొని బయటకు వస్తున్న లక్షలాది యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ.

ఇందులో భాగంగా ముద్ర యోజన (మైక్రో యూనిట్ డెవలప్‌మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ)ని తీసుకు వచ్చారు.యువతకు ఉద్యోగాల కల్పనలో భాగంగా ముద్ర యోజనను తీసుకు వచ్చారు. ఇది యువతకు స్వయంఉపాధి కల్పిస్తుంది. ముద్ర యోజన ద్వారా చిన్న చిన్న సంస్థలకు, ఎంటర్‌ప్రెన్యూయర్స్‌కు ఉపాధి దొరుకుతుంది.వ్య‌వ‌సాయేత‌ర రంగాలైన త‌యారీ, వాణిజ్యం, సేవా రంగాల్లో రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కూ ప్ర‌భుత్వం క‌ల్పించే రుణ‌మే ముద్రా రుణం. ఈ ర‌క‌మైన రుణాల‌ను ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్ర‌యివేటు బ్యాంకులు, స‌హ‌కార బ్యాంకుల నుంచి పొంద‌వ‌చ్చు. ప్ర‌ధాన మంత్రి ముద్రా యోజ‌న కింద ఈ రుణాల‌ను అంద‌జేస్తారు.

వీటితో పాటు ఎన్‌బీఎఫ్‌సీలు, సూక్ష్మ రుణ సంస్థ‌లు సైతం రుణాల‌నందించేందుకు ప్ర‌భుత్వం అంగీక‌రించింది. తాజాగా ముద్ర యోజన పథకం కింద ఇచ్చే రుణాల లక్ష్యాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. మూడు లక్షల కోట్లకు పెంచుతూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇప్పటి వరకు 10.38 కోట్ల మంది లబ్ధిదారులకు రూ. 4.6 లక్షల కోట్ల రుణాలు అందజేశారు. ఈ రుణాలు పొందిన మొత్తం లబ్ధిదారుల్లో 76 శాతం మంది మహిళలు. 50 శాతానికి పైగా మంది లబ్ధిదారులు ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలని జైట్లీ తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 2.44 లక్షల కోట్లుగా ఉన్న రుణాల లక్ష్యాన్ని 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. మూడు లక్షల కోట్లకు పెంచుతూ బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు జైట్లీ వివరించారు. క్రితం అన్ని సంవత్సరాలలోనూ మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రెఫినాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ (ముద్ర) యోజన పథకం కింద రుణాల లక్ష్యాలను చేరుకోవడంతో ఈసారి బడ్జెట్‌లో రుణాల పంపిణీ లక్ష్యాన్ని పెంచినట్లు ఆయన వివరించారు. పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం వంటివి కూడా ఈ పథకం పరిధిలోకి వస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: