తెలంగాణలో రసవత్తరం - ఏపీలో ఏకగ్రీవం..! తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల హడావుడి

Vasishta

దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 59 స్థానాలకు 23వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని 3 స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవం కావడంతో అక్కడ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక తెలంగాణలో మాత్రం ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇప్పుడు తెలుగు ప్రజల దృష్టంగా తెలంగాణవైపే మళ్లింది.


          ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. అయితే అసెంబ్లీలోని బలాబలాలను బట్టి అధికార తెలుగుదేశం పార్టీకి 2, ప్రతిపక్ష వైసీపీకి ఒక స్థానం దక్కుతాయి. అందుకు తగ్గట్లే 2 స్థానాల్లో టీడీపీ, 1 స్థానంలో వైసీపీ అభ్యర్థులను బరిలోకి దింపాయి. నామినేషన్ పత్రాలు కూడా సక్రమంగా ఉండడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ఇప్పటికే ప్రకటించారు. టీడీపీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ పోటీ చేశారు. వైసీపీ తరపున నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు. వీరు ముగ్గురూ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


          ఇక తెలంగాణలోమాత్రం అనివార్యమైంది. తెలంగాణలో మొత్తం 3 స్థానాలకు ఎన్నిక జరగనుంది. అయితే నలుగురు అభ్యర్థులు బరిలో నిలవడంతో ఎన్నిక తప్పట్లేదు. దీంతో తెలంగాణలో 23న ఎన్నిక జరగనుంది. టీఆర్ఎస్ తరపున జోగినిపల్లి సంతోష్ కుమార్, బండ ప్రకాశ్, లింగయ్య యాదవ్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బలరాం నాయక్ పోటీ చేశారు. వాస్తవానికి టీఆర్ఎస్ కు పూర్తి స్థాయి బలముంది. దీంతో ఆ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే కానుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతోంది.


          తెలంగాణలో ప్రస్తుత బలాబలాలను బట్టి టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక నల్లేరుపై నడకే.! 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున 21 మంది ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన పాలేరు, నారాయణ్ ఖేడ్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. దీంతో కాంగ్రెస్ బలం 19కి పడిపోయింది. వీరిలో ఏడుగురు టీఆర్ఎస్ లో చేరడంతో 12 మంది మాత్రమే మిగిలారు. తాజాగా వీరిలో ఇద్దరి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడంతో 10 మంది మాత్రమే మిగిలారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజ్యసభలో గెలవాలంటే కనీసం 30 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఆ బలం కాంగ్రెస్ కు లేదు. మరోవైపు టీఆర్ఎస్ తమ అభ్యర్థుల గెలుపుకోసం వ్యూహరచన చేసింది. ఒక అభ్యర్థికి 33 మంది, మిగిలిన ఇద్దరు అభ్యర్థులకు 32 మంది చొప్పున ఓటేసేలా మాక్ ఓటింగ్ నిర్వహించింది. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ముగ్గురూ రాజ్యసభకు వెళ్లడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: