కంచుకోటలో కూలుతున్న తెలుగుదేశం..!

Vasishta

అతి పెద్ద జిల్లాలో అధికార పార్టీ బలహీనపడుతోంది. అనంతపురం జిల్లా టీడీపీ వర్గాల్లో ఆధిపత్య పోరు నెలకొంది. ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతల మధ్య కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయి. ఈ పరిణామాల వల్ల వచ్చే ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లకు ఎదురు దెబ్బ తప్పకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు..


రాష్ట్ర విభజన, అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గత ఎన్నికల్లో జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు, 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైకిల్ పార్టీ జయ భేరీ మోగించింది. అయితే నాలుగేళ్ల కాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరించిన తీరుతో పార్టీ ప్రతిష్ట మసకబారింది. కలిసి పని చేయాల్సిన ఈ నేతలు ఆధిపత్యం కోసం నిత్యం గొడవ పడుతున్నారు. దీంతో వారి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇందులో నలిగిపోయి కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు విసుగెత్తిపోయారు. జిల్లాలోని అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి, రాయదుర్గం, గుంతకల్లు, పుట్టపర్తి, కదిరి, పెనుగొండ నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల మధ్య అధిపత్య పోరు కొనసాగుతోంది. పార్టీ సమన్వయ కమిటీ సమావేశాల్లో ప్రతిసారి అధిపత్య పోరుపై చర్చిస్తున్నారు. కలిసి పని చేయాలని తీర్మానిస్తున్నారు. కానీ దాన్ని ఎవరూ ఆచరించి చూపించడం లేదు.


అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు నడుస్తున్నాయి. ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ, మంత్రి పరిటాల సునీతల మధ్య హంద్రీ నీవా ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయమై గొడవలు సాగుతున్నాయి. ఇక కదిరి నియోజక వర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే చాంద్ బాషాకు, పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి వెంకట ప్రసాద్ కు అసలు పడటం లేదు.


పెనుకొండ నియోజక వర్గంలో ఎమ్మెల్యే పార్థసారథికి, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్పకు పలు అంశాల్లో విబేధాలు కొనసాగుతున్నాయి. పుట్టపర్తి నియోజక వర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డికి పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో అభిప్రాయ బేధాలున్నాయి. తాడిపత్రి నియోజక వర్గంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి, స్థానిక నాయకులకు మధ్య అగాధం ఏర్పడింది. ఎన్నికల ముందు పార్టీలో చేరిన జేసీ బ్రదర్స్ తో ఇమడలేక చాలా మంది నాయకులు స్తబ్దతగా ఉంటున్నారు.


ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ అయిన దీపక్ రెడ్డి సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అసంతృప్తి నేతలకు అండగా నిలుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి తో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు రాయదుర్గంలో సామాజిక వర్గ సమావేశం నిర్వహించి అందరినీ ఏకతాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కాలవ శ్రీనివాసులుకు వ్యతిరేకంగానే ఈ పని చేసినట్లు తెలుస్తోంది. 


రాబోయే ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య త్రిముఖ పోటీ హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీలో కొనసాగుతున్న వెన్నుపోట్లు, కుమ్ములాటలు ఎన్నికల్లో ప్రతిపక్షాలకు లబ్ధి చేకూర్చేలా కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేల బలం సగానికి సగం పడిపోయినా ఆశ్చర్య పోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: