దాచేపల్లి ఘటనలో బాధితురాలిని పరామర్శించిన చంద్రబాబు!

siri Madhukar
దాచేపల్లి ఘటనలో బాధితురాలిని పరామర్శించిన చంద్రబాబు మాట్లాడుతూ..టీవల జరిగిన కథువా, ఉన్నావో వంటి వరుస ఘటనలు దేశాన్నే కలచి వేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. "అదే విధంగా మన రాష్ట్రంలో కూడా కొంతమంది దుర్మార్గులు అక్కడక్కడ తయారవుతున్నారు. అలాంటి వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని..అది సామాన్యులే కాదు ఎంతటి పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులైనా లేక్కచేయబోమని..తప్పు చేసిన వారికి కఠినంగా శిక్ష పడే వరకు చూస్తామని అన్నారు.

ఎంతటి వారైనా తప్పించుకోలేరు. నేరం చేసినా ఏమీ జరగబోదనే ధీమా ఎవ్వరిలోనూ ఉండడానికి వీల్లేదని అన్నారు. దాచేపల్లి ఘటనలో అత్యాచారానికి గురైన బాలికను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఆయన పరామర్శించారు. అనంతరం, మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, దాచేపల్లి ఘటన చాలా బాధాకరం, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై నాగరిక ప్రపంచం సిగ్గుపడాలని, రాష్ట్రానికి సందేశం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఎవ్వరయినా మరోసారి ఇటువంటి ఘటనకు పాల్పడితే కఠిన శిక్ష ఎదుర్కొంటారు. అందరూ గుర్తు పెట్టుకోవాలి. మీ ఇంట్లో ఎవరైనా ఉన్మాదుల్లా తయారవుతుంటే వారిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై అవగాహన కల్పించడం కోసమే సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తాం. విజయవాడలో నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ రాష్ట్రంలోని అందరూ పాల్గొనండి, ప్రజల్లో అవగాహన తీసుకురండి" అని చంద్రబాబు నాయుడు అన్నారు.

ఇలాంటి ఘటనలపై రాజకీయాలు చేయడం దారుణమంటూ పరోక్షంగా వైసీపీపై మండిపడ్డారు. దారుణ సంఘటన నేపథ్యంలో ప్రజలు కూడా చైతన్యంతో వ్యవహరించాలని కోరారు. బాధితురాలికి సంఘీ భావంగా సోమవారం ప్రతి మండలంలో ర్యాలీ నిర్వహిస్తామని, ‘ఆడబిడ్డకు రక్షణగా నిలుద్దాం’ అంటూ నిర్వహించే ఈ ర్యాలీలో అందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: