కేంద్రంపై దండెత్తిన చంద్రబాబు.. కలిసొచ్చిన 7 రాష్ట్రాలు..!

Chakravarthi Kalyan

మోడీపై పోరాటానికి కాలుదువ్వుతున్న చంద్రబాబుకు 15 వ ఆర్థిక సంఘం సిఫార్సులు కలిసొచ్చినట్టు కనిపిస్తున్నాయి. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనమేంటి అనే కోణంలో చంద్రబాబు ఇతర రాష్ట్రాలను కూడగడుతున్నారు. ఈ ప్రయత్నానికి ఇప్పటివరకూ ఏడు రాష్ట్రాలు కలసి వచ్చాయి. చంద్రబాబుతో గళం కలిపాయి.


అమరావతి వేదికగా జరిగిన ఏడు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం కేంద్ర విధానాలను, ఆర్థిక సంఘ నియమ నిబంధనలను ఎండగట్టింది. పలు అంశాలపై చర్చించిన మంత్రులు, కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్యలను సహించేది లేదని స‌్పష్టం చేశారు. అంతేకాదు. మోడీ సర్కారు తీరుపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు.


ఆర్థిక సంఘం విధానాలు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న వివక్షకు అద్దం పడుతున్నాయని చంద్రబాబు అంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నిధుల కేటాయిస్తే జనాభా నియంత్రణ పాటిస్తూ ఆర్థికంగా పురోగతిలో ఉన్న రాష్ట్రాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు.


మోడీ చేస్తున్న ఈ అన్యాయాన్ని సహించేది లేదని న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలను మార్చాలని కోరుతూ రాష్ట్రపతిని కలుద్దామని చంద్రబాబు ఏడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు సూచించారు. ఈ ప్రయత్నంలో చంద్రబాబు కొంతవరకూ విజయం సాధించారు కూడా.


ఆర్థిక మంత్రుల తొలి సదస్సులో నాలుగు రాష్ట్రాలే పాల్గొన్నాయి. కానీ ఇప్పుడు అమరావతిలో జరిగిన సదస్సులో ఏడు రాష్ట్రాలు పాల్గొన్నాయి. కేంద్ర పెత్తనంపై మిగతా రాష్ట్రాలకు అవగాహన పెరుగుతోందని ఈ ఆర్థిక మంత్రులు అభిప్రాయపడ్డారు. రాజకీయ కారణాల వల్ల కొన్ని రాష్ట్రాలు హాజరు కాలేదని.. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుందని వారు ఫీలవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: