మరో మైలురాయిని చేరుకోబోతున్న జగన్..!

Vasishta

వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇప్పటికే వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటిన జగన్.. మరో రెండ్రోజుల్లో 2 వేల కిలోమీటర్ల యాత్ర పూర్తి చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని మాదేపల్లి ఇందుకు వేదికవుతోంది. 2వేల కిలోమీటర్ల మైలురాయి చేరుకోబోతున్న సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.


2017 నవంబర్‌6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. 180 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో 3 వేల కిలోమీటర్ల మేర వైఎస్‌జగన్‌పాదయాత్ర సాగనుంది. ఇప్పటివ‌ర‌కూ కడప , క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది.  ప్రజాసంకల్పయాత్ర  2000 కిలోమీటర్ల చేరుకోగానే జగన్ పైలాన్ అవిష్కరించంనున్నారు.


పశ్చిమ గోదావరి జిల్లాలో 2000వేల కిలోమీటర్లు చేరుకుంటున్న సందర్భంగా వైసీపీ శ్రేణులు పైలాన్ ఆవిష్కరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 2003 మే 14తేదీన వైయస్  రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రజా ప్రస్తానం యాత్ర ఖమ్మం జిల్లా మీదుగా జిల్లాలోని కమావరపు కోటలోకి చేరుకుంది. అలాగే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి 2004 మే14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా వైఎస్ మరణం తర్వాత షర్మిల చేపట్టిన యాత్ర 2013 మే 16న కామవరపు కోట మీదుగా 2000వేల కిలోమీటర్ల మైలు రాయి చేరుకుంది. వీటన్నిటి నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో 2000 కిలోమీటర్ల గుర్తుగా పైలాన్ ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు.


ఈ నెల 14వ తేదీన 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని పెంపొందించాలని పార్టీ ఒక కార్యాచరణను సైతం రూపొందించింది. అన్నిజిల్లాల్లో పాదయాత్రకు సంఘిభావంగా పాదయాత్రలు నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 14, 15 తేదీల్లో  ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సీఎం చంద్రబాబు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ  నల్లజెండాలతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు శ్రేణులు పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించింది. 16వ తేదీన వంచనపై గర్జన పేరుతో  అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపట్టనుంది.


రాయలసీమ జిల్లాల్లో  బలంగా ఉన్న వైసీపీ, జగన్ ప్రజాసంకల్ప యాత్రకు అదేస్థాయిలో ప్రజలు హాజరయ్యారు. అయితే కోస్తాంధ్రలో  పాదయాత్ర మొదలైనప్పటి నుంచి పార్టీ బలోపేతం దిశగా ముందుగానే ప్రణాళిక రూపొందించినట్లు కనిపించింది. టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో  జగన్ పాదయాత్ర ప్రారంభం కాగానే  టీడీపీ నుంచి వలసలు ప్రారంభం అయ్యాయి. టీడీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ ,యలమంచిలి రవి , విశాఖకు చెందిన కన్నబాబు,కర్నూలుకు చెందిన రాం భూపాల్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు.ఇక కృష్ణా జిల్లాలో జగన్ పాదయాత్ర  ప్రారంభమవ్వగానే జిల్లాకు ఎన్టీయార్ పేరు పెడతాని జగన్ సంచలన ప్రకటన చేశారు.


వైసీపీ  అధికారంలోకి రాగానే  తానూ ప్రవేశ పెట్టిన నవరత్నాలు అమలు చేస్తానని వాటి గురించి వివరిస్తూ ప్రజలతో జగన్ మమేకం అవుతూ  పాదయాత్రను కొనసాగిస్తున్నారు. జగన్ ప్రకటించిన 9 హామీలతో పాటు   మరికొన్ని హామీలను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే  టీడీపీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్న జగన్  2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: