ఫిరాయిపు ఎంపి బుట్టా రేణుకకు క్ష కార్యక్రమంలో ఘోర అవమానం జరిగింది. ఊహించని రీతిలో జరిగిన అవమానానికి తట్టుకోలేక కార్యక్రమం నుండే వెళ్ళిపోయారు. కర్నూలు ఎంపిగా వైసిపి తరపున గెలిచిన బుట్టా తర్వాత తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే టిడిపిలోకి ఫిరాయించారో అప్పటి నుండో రేణుకకు సమస్యలు మొదలయ్యాయి. ఫిరాయించిన పాపానికి ఇటు వైసిపి నేతలెవరూ ఎంపితో పెద్దగా మాట్లాడటం లేదు. పోనీ టిడిపి నేతలైనా బాగున్నారా అంటే అదీ లేదు. దాంతో ఏం చేయాలో బుట్టాకు అర్ధం కావటం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు దక్కుతుందా లేదో తెలీదు. ఒక వేళ టిక్కెట్టు దక్కినా గెలుపు అనుమానమే. ఇటువంటి పరిస్దితుల్లో తాజాగా బుట్టాకు పెద్ద అవమానమే జరిగింది.
ఇది..ఫిరాయింపు ఎంపి పరిస్దితి
కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన ఖర్చంతా ఎంపి నిధుల్లో నుండి మంజూరు చేశారు. మినీ వాటర్ ప్లాంట్ నిర్మాణమైన తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టుకున్నారు. తన నియోజకవర్గంలోని టిడిపి నేతలకే కాకుండా జిల్లాలోని ఇద్దరు మంత్రులతో పాటు ఎంఎల్ఏలకు కూడా ఎంపి ఆహ్వానాలు పంపారు. ఈరోజు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఎంపి అట్టహాసంగా హాజరయ్యారు. అయితే, కార్యక్రమానికి హాజరైన ఎంపికి ఒక్కసారిగా షాక్ కొట్టింది. విషయం ఏమిటంటే ప్రారంభోత్సానికి ఎంపి అంతమందిని ఆహ్వానించినా ఒక్కరు కూడా హాజరుకాలేదు. మంత్రులు కానీ ఎంఎల్ఏ కానీ కనీసం నియోజకవర్గంలోని టిడిపి నేతలు కూడా హాజరుకాలేదు. దాంతొ అవమానంగా బావించిన ఎంపి చేసేది లేక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు. దాంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఫలితం ఎలా ఉండబోతోందో ఇపుడు జరిగిన ఘటన ఓ సూచనప్రాయంగా కనబడుతోంది.