వేళ్లన్నీ రమణదీక్షితులు వైపే..!! సెల్ఫ్ గోల్ వేసుకున్నారా..?

Vasishta

తిరుమల ఆగమశాస్త్రానికి విరుద్ధంగా పనులు జరుగుతున్నాయంటూ వచ్చిన ఆరోపణలు – ప్రత్యారోపణలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు లేవనెత్తిన అంశాలు ఇప్పుడు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. గతంలో ఆయనతో పాటు కలిసిన పనిచేసినవారు ఇప్పుడు రమణదీక్షితులుపైనే వేలెత్తి చూపుతున్నారు. పైగా ఇది రాజకీయ రంగు పులుముకోవడం మరిన్ని వివాదాలకు ఆజ్యం పోస్తోంది. తిరుమలేశుని సన్నిధిలోని అత్యంత విలువైన గులాబి వజ్రం కనిపించడం లేదంటూ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణ పెద్ద దూమారాన్నే లేపింది. కాని అది వజ్రమే కాదని కేవలం కెంపు మాత్రమేనని... అది కూడా విసిరిన నాణాల దెబ్బకు పగిలిపోయిందని టీటీడీ అధికారిక వర్గం వివరణ ఇచ్చింది. ఓ న్యాయమూర్తి విచారణ నివేదికను ఆధారంగా కూడా చూపింది..


స్వామి ఖజనాలో అటువంటి వజ్రాలే లేవని అధికార వర్గం స్పష్టం చేస్తింది. కానీ పదేళ్ల క్రితం బంగారు డాలర్ల కేసులో విచారణ చేపట్టిన అప్పటి CVSO.... ఇచ్చిన నివేదికలో వేల కోట్ల విలువ చేసే పింక్ డైమండ్ ఉందని పేర్కొన్నారు. దాన్నే అస్త్రంగా చూపిస్తూ రమణదీక్షితులు ఆరోపణలు చేస్తున్నారు. అర్చకులకు 65ఏళ్ల వయోపరిమితి విధిస్తూ టీటీడీ ధర్మకర్తల మండల నిర్ణయం తీసుకోడాన్ని వ్యతిరేకించిన రమణదీక్షితులు... శ్రీవారి ఆలయంలో సేవా కైంకర్యాల సక్రమంగా జరగడంలేదని... స్వామివారి ఆభరణాలకు భద్రత లేదంటూ... మాజీ సీవీఎస్వో నివేదికను బయటపట్టారు. పింగ్ డైమండ్ అపహరణకు గురైనట్లుగా సంకేతాలిచ్చారు..


రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై స్పందించిన టీటీడీ EO అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ...1952 నుంచి నమోదు చేస్తున్న తిరువాభరణాల లిస్టు ప్రకారం అటువంటి పింక్‌ డైమండ్‌... స్వామి వారి ఆభరణాలలో లేదని స్పష్టం చేశారు. 1945 లో మైసూరు మహారాజ భక్తితో తిరుమలేశునికి ఒక మణిహారాన్ని సమర్పించారని అందులో పొదిగిన కెంపును వజ్రంగా అంతా భావించారని పేర్కొన్నారు. 2011 లో గరుడ సేవ ఊరేగింపు సందర్భంగా భక్తులు విసిరిన నాణాల దెబ్బకు ఆ హారంలోని కెంపు ముక్కలు కాగా అప్పటి ప్రధాన అర్చకులు రమణదీక్షితులే ఆ ముక్కలను సేకరించారని స్వామివారి ఆభరణాలపై విచారణ జరిపిన జస్టిస్‌ జగన్నాధ రావు కమిటి నివేదిక తెలియచేస్తున్నదని వివరించారు. ఆ విధంగా కెంపు ముక్కలైన విషయాన్ని 2010 లో ఆనాటి టీటీడీ కార్వనిర్వహణాధికారి ఐవైఆర్‌.కృష్ణారావు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కూడా పొందుపరిచారు..


తిరుమలలో 300 బంగారు డాలర్లు మాయమైన ఘటనపై విచారణ జరిపిన అప్పటి CVSO రమణకుమార్ 2007 జూలై 28 వ తేదిన సమర్పించిన విచారణ నివేదికలో పింక్‌ డైమండ్‌ గురించి పేర్కొన్నారని రాయలసీమపోరాట సమితి నవీన్‌కుమార్‌రెడ్డి ఆధారంగా చూపడంతో చర్చ మళ్లీ మొదటికొచ్చింది. ఇలాంటి తరుణంలో..... 2007లో నివేదిక సమర్పించిన మాజీ CVSO రమణకూమార్.. పింక్ డైమండ్ పై క్లారిటీ ఇచ్చారు. కేవలం ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులు... స్వదస్తూరితో ఇచ్చిన వివరాల మేరకే.. స్వామివారి ఆభరణాల్లో పింక్ డైమండ్ ఉందని పేర్కొన్నట్లు వెల్లడించారు. పింక్ డైమండ్ పై తాను నివేదిక ఇచ్చిన తర్వాత ఓ న్యాయమూర్తి కమిటీ దర్యాప్తు జరిపి అది కేవలం రూబీ స్టోన్ మాత్రమే అని తేల్చిన సంగతిని కూడా రమణకుమార్ గుర్తుచేశారు. ఉద్దేశపూర్వకంగానే రమణదీక్షితులు తనను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు....


రమణ దీక్షితులుపై గతంలో కూడా ఎన్నో వివాదాలున్నాయన్న రమణకుమార్... తన అధికారిగా ఉన్నప్పుడే రమణదీక్షితులు.. చేతివాటం చూపించారని వెల్లడించారు. ఓ భక్తుడు ఇచ్చిన విరాళాన్ని తన బ్యాంకు ఖాతాలో వేసుకున్నారన్నారు. స్వామివారి ఆభరణాల విషయంలో CBI విచారణ వేయడం మంచిదే అన్న రమణకుమార్... అలా చేస్తే.. రమణదీక్షుతులు చేసిన అవకతవకలన్నీ బయపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వామి వారి సేవా కైంకర్యాలు, ఆభరణాల భద్రత అంటూ మొదలైన వివాదం... ఇప్పుడు రమణదీక్షితులు మెడకు చుట్టుకునే లానే కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: