రాజకీయ నాయకులకు విశ్వసనీయత అత్యంత కీలకం. వారు చెప్పే మాటలకు, చేసే విమర్శలకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. విమర్శలు సైతం ప్రజలు చర్చించుకునేలా ఉండాలి. ఏదో పోసుకోలు కబుర్లు చెప్పేసి అప్పటికప్పుడు మమ: అనిపించుకుంటే రాజకీయంగా ప్రజల మనసులు నెగ్గేదెలా? ఇప్పుడు ఇదే ప్రశ్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఆయన చేస్తున్న కొన్ని విమర్శలు, వ్యాఖ్యలు విశ్వసనీయతకు దూరంగా ఉంటున్నాయి. టీడీపీతో నాలుగేళ్ల బంధాన్ని తెంచుకుని.. ఒంటరిపోరుకు సిద్ధమైన పవన్.. ఇప్పుడు అధికార పార్టీని విమర్శించడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ, అనూహ్యంగా ఆయన చేస్తున్న విమర్శలు అతిశయంగా ఉంటున్నందునే ``ఈ తలనొప్పి ఏంట్రా.. బాబూ`` అనుకునే పరిస్థితి వస్తోంది.
రాజకీయాల్లో రెండు రకాల విమర్శలు ఉంటాయి. ఒకటి నిర్మాణాత్మక, రెండు ఎదుటి వారిని డిఫెన్స్‌లో పడేయడం. ఈ రెండు కూడా మించిపోయి గ్యాసిప్‌లే ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే పవన్ చేస్తున్నాడనే సోషల్ మీడియా ప్రచారం ఎక్కువగా ఉంటోంది. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో ఉన్న పవన్ ప్రభుత్వంపైనా, చంద్రబాబుపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడు. కేంద్రంపైనా విమర్శలు గుప్పిస్తున్నా డు. ఈ క్రమంలోనే పవన్ చేసిన కొన్ని విమర్శలు సత్యదూరంగా ఉండడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
మరో ఏడాదిలోనే జరగనున్న ఎన్నికల్లో వైసీపీతో చంద్రబాబు జట్టుకట్టే అవకాశం లేకపోలేదు. అంటూ పవన్ వ్యాఖ్యానించాడు. మరి ఈ విమర్శ వెనుక ఆయనకు అందిన ఫీడ్ బ్యాక్ ఏంటో ఆయనకే తెలియాలి. నిజానికి రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలే ప్రత్యర్థులుగా ఉన్నాయి. వైసీపీ, టీడీపీ. అధికారంలో ఉన్న టీడీపీపై వైసీపీ ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉంది. చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదని పిస్తోందని అంటూ నంద్యాల ఉప పోరు సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. అదేవిధంగా బాబును బంగాళా ఖాతంలో కలిపినా తప్పులేదు. అని ఎన్నో సార్లు జగన్ నోరు పారేసుకున్నాడు.
ఇక, టీడీపీ విషయానికి వస్తే.. జగన్‌ను తిట్టని నాయకులు లేరు. జగన్ గజదొంగ అంటూ ఎన్నో వేదికలపై చంద్రబాబు విమర్శించారు. మరి అలాంటి రెండు చురకత్తులు ఒకే ఒరలోకి వస్తాయని పవన్ ఆరోపించడం విస్మయానికి గురి చేస్తోంది. ఏదో విమర్శించాలి. ఏదో ఆరోపణలు చేయాలి- అనుకుని ఇలా చేశాడనే ప్రతికూల వ్యాఖ్యలు వినిపించేలా పవన్ వ్యవహరించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. రాజకీయాల్లో మాటలే తూటాలు. వ్యాఖ్యలే ఆయుధాలు. వాటిని చాలా జాగ్రత్తగా వినియోగిస్తేనే.. నాయకులకు వాల్యూ పెరిగేది!