హిందుపురంలో చంద్ర‌బాబుకు త్వ‌ర‌లో షాక్

Vijaya
వైసిపి అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ఎఫెక్ట్ తెలుగుదేశంపార్టీపై బాగానే ప్ర‌భావం  ప‌డుతున్న‌ట్లుంది.  అందులో భాగంగానే తాజాగా అనంత‌పురం జిల్లాలో చంద్ర‌బాబుకు షాక్ త‌ప్ప‌ద‌ని అంటున్నారు. జిల్లాలోని హిందుపురం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన అబ్దుల్ ఘ‌నీ త్వ‌ర‌లో వైసిపిలో చేర‌టానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అన్ని ప‌రిస్ధితులు సానుకూల‌మైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో హిందుపురం నుండి ఎంపిగా కానీ లేక‌పోతే ఎంఎల్ఏగానో వైసిపి త‌ర‌పున ఘ‌నీ పోటీ చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. 


ఘ‌నికి షాకిచ్చిన బాల‌య్య‌


ఇంత‌కీ విష‌యం ఏమిటంటే,  రాష్ట్రం మొత్తం మీద టిడ‌పికి పెట్ట‌ని కోట‌ల్లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో హిందుపురం  కూడా ఒక‌టి. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుండి హిందుపురంలో టిడిపి ఒక్క‌సారిగా ఓడిపోలేదు. ఒక‌సారి ఇక్క‌డి నుండి ఎన్టీఆర్ కూడా ప్రాతినిధ్యం వ‌హించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అటువంటిది ఇక్క‌డ నుండి 2004, 2009లో అబ్దుల్ ఘ‌నీ ఎంఎల్ఏగా రెండు సార్లు గెలిచారు.మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో హ‌టాత్తుగా ఎన్టీఆర్ కొడుకు నంద‌మూరి బాల‌కృష్ణ ఊడిప‌డ్డారు. 


ఘ‌నీకిచ్చిన హామీలేమ‌య్యాయి ?


అప్ప‌ట్లో బాల‌కృష్ణ సేఫ్ సీటు కోసం చూసిన‌పుడు హిందుపురం క‌న‌బ‌డింది. దాంతో చంద్ర‌బాబు వెంట‌నే ఘ‌నీని పిలిపించి విష‌యం చెప్పారు. స్వ‌యంగా ఎన్టీఆర్ అభిమాని కావ‌టంతో బాల‌కృష్ణ‌కు ఎదురు చెప్ప‌లేక‌పోయారు. ఎంఎల్ఏ సీటును త్యాగం చేసినందుకు మంచి పోస్టు ఒక‌టి ఇస్తాన‌ని చంద్ర‌బాబు హామీ కూడా ఇచ్చారు. దాంతో వేరేదారి లేక ఘ‌నీ త‌లూపారు. అందుక‌నే రెండు సార్లు ఎంఎల్ఏగా ప‌నిచేసిన ఘ‌ని చివ‌ర‌కు ఎన్నిక‌ల స‌మ‌యంలో బాల‌య్య‌కు చీఫ్ ఎల‌క్ష‌న్ ఏజెంటుగా ప‌నిచేశారు. అదంతా చ‌రిత్ర‌గా మిగిలిపోయింద‌నుకోండి అది వేరే సంగ‌తి.


పార్టీలో ఘనీకి అవ‌మానం..గాల‌మేసిన వైసిపి


2014 ఎన్నిక‌లైపోయిన త‌ర్వాత ఇటు గెలిచిన‌ బాల‌కృష్ణ‌తో పాటు అటు చంద్ర‌బాబు కూడా ఘ‌నీని మ‌ర‌చిపోయారు.  త‌న‌కిచ్చిన హామీ గురించి బాల‌కృష్ణ‌, చంద్ర‌బాబుకు గుర్తు చేద్దామ‌ని ఘ‌ని ఎంత ప్ర‌య‌త్నించినా సాధ్యం కాలేదు. దాంతో పార్టీలోనే ఉంటున్నా ఎవ‌రికీ ప‌ట్టనివాడిగా అయిపోయాడు. బాల‌కృష్ణ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చినా ఘ‌నీ ఎప్పుడూ ప‌ట్టించుకోలేదు. దాంతో ఘ‌నీ కూడా పార్టీకి దూరమైపోయారు. ఈ విష‌యాల‌న్నింటినీ వైసిపి నేత‌లు ద‌గ్గ‌రుండి చూస్తున్నారు. దాంతో అదే విష‌యాన్ని జ‌గ‌న్ వద్ద క‌దిపారు. జ‌గ‌న్ నుండి కూడా గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. వెంట‌నే ఘ‌నీకి వైసిపిలోకి ఆహ్వానం అందింది. అయితే, తాను వైసిపిలోకి వ‌స్తే త‌నకేంటి అని ఘ‌ని అడిగారు. హిందుపురం ఎంఎల్ఏగానీ లేక‌పోతే ఎంపిగా కానీ టిక్కెట్టు  ఇవ్వాలంటూ స్ప‌ష్టంగా చెప్పారు.  ముందు పార్టీలో చేర‌మ‌నండి ఏ విధంగా ఉప‌యోగించుకోవాలో ఆలోచిద్దామంటూ జ‌గ‌న్ క‌బురుపంపారు. అందుకు ఘ‌నీ అంగీక‌రించ‌లేదు. ఆ విష‌యం మీదే  స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. 


మండిపోతున్న ఘ‌నీ


మొత్తం మీద తేలిదేమిటంటే ఘ‌నీకి చంద్ర‌బాబు, బాల‌య్య‌ల‌పై బాగా మండిపోతోంది. ఎందుకంటే, ఘ‌ని వైసిపిలోకి మారే అవ‌కాశాలున్న‌ట్లు చంద్ర‌బాబు, బాల‌య్య‌ల‌కు కూడా స‌మాచారం ఉంది. అందుక‌నే మొన్న‌టి రంజాన్ పండుగ రోజున టిడిపి ఆఫీసు నుండి ఘ‌నీతో మాట్లాడాల‌ని ప్ర‌య‌త్నం చేస్తే సాధ్యం కాలేదు. పార్టీ కార్యాల‌యం నుండి చంద్ర‌బాబు త‌ర‌పున ఫోన్ చేసినా ఘ‌నీ స్పందించ‌లేదు. పైగా త‌న ఫోన్ ను స్విచ్చాప్ చేసేశారు. పార్టీలో త‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోన‌పుడు టిడిపిలో ఎందుకుండాల‌న్న‌ది ఘ‌నీ వాద‌న‌. ఘ‌నీకి జ‌రిగిన అవ‌మానం అంద‌రికీ తెలిసిందే.  అందుకు జిల్లా నేత‌ల వ‌ద్ద కూడా స‌మాధానం లేదు. భ‌విష్య‌త్తులో ఘ‌నికి స‌ముచిత స్ధానం ల‌భిస్తుంద‌ని కూడా న‌మ్మ‌కం లేదు. అందుక‌నే టిడిపి సెంట్ర‌ల్ ఆఫీసు కోరినా  జిల్లా నేత‌లెవ‌రూ ఘ‌నీ విష‌యంలో క‌ల్పించుకునేందుకు సిద్ధంగా లేరు. జ‌గ‌న్ ద‌గ్గ‌ర నుండి క‌బురు కోస‌మే ఘ‌ని ఎదురు చూస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: