ఇంత వరకూ ఏ ఎంఎల్ఏ చేయని సాహసాన్ని ఆ ఎంఎల్ఏ చేశారు. వినూత్నంగా ఉంటుందని ఎంఎల్ఏ చేసిన పనితో జిల్లా అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇంతకీ ఎంఎల్ఏ ఏం చేశారో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. తూర్పుగోదావరి జిల్లాలోని పాలకొల్లు ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడు అధికార పార్టీ నేత అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంతకీ విషయం ఏమిటంటే, రామానాయుడు స్మశానంలో పడుకున్నారు. ఎంఎల్ఏ ఏంటి స్మశానంలో పడుకోవటం ఏంటనుకుంటున్నారా ?
రాత్రంతా అక్కడే పడుకున్నారు
ఎందుకు పడుకున్నారంటే, ఏడాదిక్రితం స్మశానంలో అభివృద్ధి పనులు చేయటానికి ప్రభుత్వం రూ. 3 కోట్లను మంజూరు చేసింది. స్మశానం కదా స్ధానిక అధికారులు ఎవరూ పట్టించుకోలేరు. స్ధానికుల నుండి ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా అధికార యంత్రాంగం లెక్క చేయలేదు. దాంతో అదే విషయం ఎంఎల్ఏ దృష్టికి కూడా వచ్చింది. రామానాయుడు మాట్లాడినా అధికారులు అదిగో ఇదిగో అంటున్నారే కానీ ఎంతకీ పనులు మొదలుపెట్టటం లేదు. స్మశానంలో పనులు చేయటానికి అధికారులు భయపడుతున్నారట. ఎంత నచ్చచెప్పినా వినకపోవటంతో ఎంఎల్ఏకి ఒళ్ళు మండిపోయింది.
ఉరుకులు పరుగులెత్తిన అధికారులు
దాంతో అధికారులకు ఎవరికీ చెప్పకుండా ఎంఎల్ఏ హటాత్తుగా శుక్రవారం సాయంత్రం స్మశానికి చేరుకున్నారు. రాత్రంతా అక్కడే పడుకున్నారు. శనివారం ఉదయం లేచి అక్కడే అవసరాలన్నీ తీర్చుకున్నారు. తర్వాత కాఫీ లాంటివి కూడా అక్కడే పూర్తి చేశారు. శుక్రవారం సాయంత్రం నుండి ఎంఎల్ఏ స్మశానంలోనే బస చేశారని తెలిసిందే అధికారుల్లో దడమొదలైంది. విషయం జిల్లా ఉన్నతాధికారులకు కూడా చేరటంతో అక్కడి నుండి అక్షింతలు మొదలయ్యాయి. వెంటనే స్ధానిక అధికారులు స్మశానానికి చేరుకున్నారు. చేయాల్సిన పనులపై అక్కడే ఎంఎల్ఏ వారితో సమావేశం జరిపారు. చేసేదిలేక వెంటనే యంత్రాంగం రంగంలోకి దిగింది. దాంతో పనులు మొదలయ్యాయి.
చూశారా ఎంఎల్ఏ చేసిన ఓ వినూత్న ఆలోచన అధికార యంత్రాగాన్ని ఎలా కదిల్చిందో ?