రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబునాయుడును ఒక వర్గం మీడియా చాణుక్యునితో పోలుస్తుంటుంది. తమ తేలివితేటలతో, చాతుర్యంతో వ్యతిరేక పరిస్ధితులను కూడా అనుకూలంగా మార్చుకోగలిగిన వారిని చాణుక్యుడంటారు. అయితే, అటువంటి పరిస్ధితులేవీ చంద్రబాబుకు ఇంత వరకూ ఎదురుకాలేదనే చెప్పవచ్చు. ఏదో ఒకటి అరా సంక్షోభం ఎదురైనా అదంతా చంద్రబాబే స్వయంగా సృష్టించుకుని సమస్యను ధీటుగా ఎదుర్కొన్నట్లు బిల్డప్ ఇస్తుంటారని గిట్టని వాళ్ళంటారు లేండి. మరి, నిజమేంటి ? ఇపుడీ విషయంపైనే రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
భయపడిన చంద్రబాబు
ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత హటాత్తుగా చంద్రబాబు రాజకీయంగా ఇబ్బందుల్లో పడిన మాట వాస్తవం. తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం తనపై కేసులు పెడుతుందని, విచారణ చేయించి అరెస్టులు చేయిస్తుందని ఒకటికి పదిసార్లు వివిధ సందర్భాల్లో చెప్పుకున్నారు. అంటే కేసులు, విచారణ, అరెస్టుల విషయంలో చంద్రబాబు ఎంతగా భయపడ్డారో అందరికీ అర్ధమైంది. సిబిఐ కేసులు, విచారణ, అరెస్టును వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఎదుర్కొంటున్నపుడు చంద్రబాబు మాత్రం భయపడాల్సిన అవసరం ఏంటి ?
చంద్రబాబుకు చాణుక్యునితో పోలికేంటి ?
ఇక చాణుక్యుని పోలిక గురించి ఆలోచిస్తే ఆ పోలిక కూడా చంద్రబాబుకు మ్యాచ్ అవ్వదని అర్ధమైపోతుంది. ఎందుకంటే, చంద్రబాబు నాయకత్వంలో ఒక్కసారి కూడా టిడిపి ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని గెలవలేదు. 1995లో చంద్రబాబు ఏ విధంగా ముఖ్యమంత్రయ్యారో అందరికీ తెలిసిందే. తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో బిజెపితో పొత్తుపెట్టుకుని వాజ్ పేయ్ చలవతో గట్టెక్కారు. తర్వాత 2004 లో బిజెపి పొత్తు వదిలేసి ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ 2009 లో వామపక్షాలు, టిఆర్ఎస్ తో కలిసి పోటీ చేసినా గెలవలేకపోయారు.
ఒంటరిగా ఎప్పుడైనా ఎన్నికల్లో గెలిచారా ?
రాష్ట్ర విభజన నేపధ్యంలో 2014లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ బిజెపితో పొత్తుపెట్టుకుని నరేంద్రమోడి చలవతో గట్టెక్కారు.
ఇక, 2019 సంగతి చూడాల్సిందే. ఒంటిరిగా పోటీ చేస్తే గెలవటం కష్టమని చంద్రబాబుకు బాగా తెలుసు కాబట్టే కాంగ్రెస్ తో పొత్తుకు తెగ ప్రయత్నిస్తున్నారు. అంటే చంద్రబాబు సిఎం అయిన ప్రతీసారి ఎవరో ఒకరి సాయం ఉందన్న విషయం వెరీ క్లియర్. ఎవరి సాయం లేకుండా ఎదుర్కొన్న 2004 ఎన్నికల్లో బోర్లా పడ్డారు.
'ఓటుకునోటు' కేసుతో చతికిలపడ్డారు
ఎన్నికల విషయాన్ని పక్కనపెడితే చంద్రబాబులోని చాణుక్యుని తెలివితేటలు బయటపడే సమస్యలేవి ఎదురుకాలేదు. ముఖ్యమంత్రవ్వగానే ' ఓటుకునోటు' కేసు వెలుగు చూసిన విషయం అందరికీ తెలిసిందే. అందులో నుండి బయటపడలేక 10 ఏళ్ళ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను అర్ధాంతరంగా వదులుకుని అమరావతిలో పడ్డారు. కేసులో నుండి బయటపడటానికి కొందరు పెద్దల సాయంతో హైదరాబాద్ ను పణంగా పెట్టిన వ్యక్తి చాణుక్యుడెలా అవుతారు ? తనపై కేసుల విచారణ జరగకుండా వ్యవస్ధలను మ్యానేజ్ చేసుకోవటాన్ని కూడా చాణుక్యుని తెలవితేటలతో పోల్చితే ఎవరూ ఏం చేయలేరు.