ఆ మంత్రి ఇలాకాలో అపొజిష‌న్‌కు అల్లుడి నోట్లో శ‌ని

VUYYURU SUBHASH
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారయ్యింది  సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నియోజకవర్గంలో క్యాడర్ పుష్కలంగా ఉన్నా , ఓటు బ్యాంకు దండిగా ఉన్నా, సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పటికీ ఐక్యత కొరవడింది. గత ఎన్నికల్లో ఓటమి పాలయినప్పటి నుంచి జయసుధ నియోజకవర్గానికి దూరమయ్యారు. కొన్నేళ్ళపాటు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని ముందుండి  నడిపించిన పిట్ల కృష్ణ రాజకీయాలకు దూరంగా ఉండడంతో నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. సికింద్రాబాద్‌ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో ఎక్కువ సార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఇటీవలి కాలంలో నాయకుల మధ్య విభేదాలు, అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్‌ పార్టీ మరింత చతికిలపడింది.
నియోజకవర్గ పరిస్థితులను క్షుణ్ణంగా గమనించిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికల్లో నటి జయసుధను తెరపైకి తెచ్చారు.

నియోజకవర్గంలో టిక్కెట్ ఆశించిన వారందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చారు. రాజకీయ అరంగేట్రంతోనే జయసుధ సంచలన విజయం సాధించారు. అంతేగాక అనంతరం జరిగిన గ్రేటర్ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం నియోజకవర్గంలోని మొత్తం ఆరు డివిజన్లను కాంగ్రెస్ పార్టీ అస్తగతం చేసుకొని రికార్డు సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థిగా పోటీ చేసిన జయసుధ మూడవ స్థానానికి పరిమితమయ్యారు. అనంతరం నియోజకవర్గం నుంచి,  కాంగ్రెస్ పార్టీకి జయసుధ దూరమయ్యారు. 


ఈ నేపథ్యంలో మాజీ మేయర్ బండా కార్తీకా రెడ్డి,  పీసీసీ కార్యదర్శులు ఆదం సంతోష్‌కుమార్,  పల్లె లక్ష్మణ్ గౌడ్  నియోజకవర్గం పై కన్నేశారు. పార్టీ శ్రేణులకు దగ్గరయ్యేందుకు ఎవరికి వారుగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పార్టీ టిక్కెట్ ఎవరికి ఇచ్చినా, మిగతా వారు సహాకరించరని అగ్ర నేతలు భావిస్తున్నారు. దీంతో మళ్లీ 2009 నాటి ప్రయోగాన్ని అమలు చేస్తేనే మంచిదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. 


ఇప్పటికే రేసులో ఉన్నవారిని కాదని, ఓ బలమైన నేతను బయటి నుంచి తీసుకొచ్చి రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌, టీడీపీ లలోని గ్రూపు తగాదాలే తమకు మేలు చేస్తాయని అధికార టీఆర్ ఎస్ పార్టీ భావిస్తోంది. రాష్ట్ర మంత్రి పద్మారావు నియోజకవర్గంలో రాజకీయంగా బలోపేతం అయ్యారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే టీఆర్ ఎస్ బలంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్, టీడీపీలలో ఏ పార్టీ అయినా బలమైన అభ్యర్థిని బరిలోకి దించితే మాత్రం పద్మారావు గట్టి పోటీ ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: