భారతీయ జనతా పార్టీ చెబుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే ఇంత భారీ కుంభకోణం రాష్ట్ర చరిత్రలో బయటపడలేదు. బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు చేస్తున్న ఆరోపణల ప్రకారం ప్రభుత్వ డబ్బును పిడి ఖాతాల్లో ఉంచటం ద్వారా చంద్రబాబునాయుడు రూ. 51 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారట. దేశంలోని ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా ఆయా రాష్ట్రాల్లోని పిడి ఖాతాలు వందల్లోనే ఉన్నాయట. మహ అయితే వెయ్యో లేకపోతే రెండువేలో ఉన్నాయట. కానీ ఏపిలో మాత్రం ఏకంగా 58 వేల ఖాతాలున్నాయట. అందులో రూ. 51 వేల ఖాతాలను చంద్రబాబు అట్టేపెట్టారట. అన్ని వేల ఖాతాలు ఎందుకు తెరిచారు ? వేల కోట్ల రూపాయలు అందులో ఉంచారు ? అన్నది జివిఎల్ ప్రశ్న.
ఆరోపణలు-ప్రత్యారోపణలేనా ?
సరే, జివిఎల్ ప్రశ్నలపైన ప్రశ్నలు, ఆరోపణలపైన ఆరోపణలు గుప్పిస్తుంటే తెలుగుదేశంపార్టీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. జివిఎల్ ఆరోపణలకు సమాధానాలు చెప్పాల్సిన టిడిపి నేతలైన, ప్లానింగ్ కమీషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావైనా ఎదురుదాడి చేస్తూనే తప్పించుకుంటున్నారు. అంతేకానీ వేలాది ఖాతాలు తెరిచి అందులో వేలాది కోట్ల రూపాయలుంచింది వాస్తవమా ? కాదా ? అని మాత్రం సమాధానాలు చెప్పటం లేదు.
ఆరోపణలపై విచారణ జరుగుతుందా ?
సరే, ఆ విషయాన్ని పక్కనపెడితే ఇంత భారీ ఎత్తున కుంభకోణం జరిగిందా లేదా అన్నది విచారణ జరిపిస్తే మాత్రమే తేలే నిజం. అంతేకానీ ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో కాలం గడిపితే తేలదన్న విషయం అందరికీ తెలిసిందే. తనపై విచారణకు అడిగే దమ్ము చంద్రబాబునాయుడులో ఎన్నడూ లేదన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు కదా . అదే సమయంలో బిజెపి కూడా తనంతట తానుగా విచారణ చేయించే అవకాశాలు కూడా దాదాపు లేవనే చెప్పాలి.
రెండు పార్టీల వ్యవహారమేనా ?
2జి స్పెక్ట్రమ్ కన్నా పెద్ద కుంభకోణమని బిజెపి నేతలు నెత్తీ నోరు మొత్తుకుంటుంటే మిగిలిన పార్టీలు ఏం చేస్తున్నట్లు . చంద్రబాబుపై బిజెపి చేస్తున్న ఆరోపణలపై వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, వామపక్షాల కార్యదర్శులు ఎవ్వరూ ఎందుకు మాట్లాడటం లేదు ? అంటే అదేదో బిజెపి-చంద్రబాబు మధ్య వ్యవహారమని అనుకుంటున్నారా ? వేలాది కోట్ల రూపాయల కుంభకోణమంటే ప్రజాధనం ఏ స్ధాయిలో దుర్వినియోగమైందనే విషయంలో ప్రతిపక్షాల నేతలకు చీమ కుట్టినట్లు కూడా ఉన్నట్లు లేదు. ఎటూ జనాల మధ్యలోనే తిరుగుతున్నారు కదా ? ఇటు జగన్ కానీ అటు పవన్ కానీ ఇదే విషయంలో మరింత లోతుగా అధ్యయనం చేసి జరిగిందేమిటో జనాలకు వివరిస్తే బాగుంటుంది కదా ?