రాజధాని నిర్మాణానికి సంబంధించి అప్పట్లో ప్రముఖ సినీదర్శకుడు రాజమౌళి వంతైపోయింది. తాజాగా ప్రముఖ నిర్మాత , పంపిణీదారుడు దగ్గుబాటి సురేష్ బాబు పాత్ర మొదలైంది. అప్పట్లో రాజధాని నిర్మాణంలో సలహాలు, సూచనలు తీసుకునేందుకు చంద్రబాబునాయుడు దర్శకుడు రాజమళిని చాలా సార్లు సంప్రదించారు. వారిద్దరి మద్య భేటీలు కూడా అయ్యాయి. నిజానికి రాజధాని నిర్మాణానికి సంబంధించి సలహాలిచ్చేంత స్ధాయి తనకు లేదని రాజమౌళి స్పష్టంగా ప్రకటించారు.
బాహుబలి సెట్టింగులు
రాజధాని నిర్మాణానికి సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నపుడే బాహుబలి సినిమా రిలీజైంది. ఇంకేముంది ఆ సినిమాలోని సెట్టింగులు చంద్రబాబుకు తెగనచ్చేశాయి. దాంతో బాహుబలి తీసిన రాజమౌళి వెంటపడ్డారు చంద్రబాబు. అప్పటికే రాజధాని నిర్మాణంపై ప్రపంచ ప్రసిద్ది చెందిన ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్ ను ఎంగేజ్ చేసుకున్నప్పటికీ చంద్రబాబు మనసంతా బాహుబలి సెట్టింగులపైనే ఉంది. చంద్రబాబుతో భేటీ సందర్భంగా సలహాలివ్వటానికి రాజమౌళి అంగీకరించలేదు. అయినా సరే, చంద్రబాబు పట్టు పట్టడంతో రాజమౌళి ఒప్పుకోక తప్పలేదు. ఆ తర్వాత జరిగిన సంగతులన్నీ అందరికీ తెలిసిందే. చివరికేమైంది ? లండన్ కు వెళ్ళి రాజమౌళిచ్చిన సలహాలు ఏ మయ్యాయో ఎవరికీ తెలీదు.
ఏపికి తెలుగు సినీ పరిశ్రమట
ఇక ప్రస్తుత విషయానికి వస్తే అమరావతిలో మీడియా సిటీ నిర్మాణానికి సంబంధించి సలహాల కోసం దగ్గుబాటి సురేష్ బాబును పిలిపించుకున్నారు. దాదాపు గంటపాటు జరిగిన సిఆర్డిఏ సమావేశంలో చంద్రబాబు, ఉన్నతాధికారుల సమావేశంలో సురేష్ కూడా భేటీ అయ్యారు. మీడియా సిటీ నిర్మాణంతో పాటు ఏపిలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారట. ప్రస్తుతం హైదరాబాద్ కే పరిమితమైన సినీ పరిశ్రమను ఏపికి రప్పించాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. మరి, అదే నిజమైతే నాలుగేళ్ళ పాటు ఎందుకు పట్టించుకోలేదు ? సరిగ్గా ఎన్నికలకు ముందే ఈ విషయంపై చంద్రబాబు ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు ? సరే, ఎంతమంది ఎన్ని సలహాలిచ్చిన చివరకు తనకు కావాల్సినట్లుగానే చంద్రబాబు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఏదో కాసేపు వాళ్ళని వీళ్ళని పిలిచి హడావుడి చేస్తారంతే.