వచ్చేఎన్నికల్లో పోటీ చేయటానికి ఇద్దరు వారసులకు మాత్రమే ప్రస్తుతానికి చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వయోభారం వల్ల 2019 ఎన్నికల్లో తాము పోటీ చేయలేమని ఇద్దరు సీనియర్ నేతలు చంద్రబాబుకు చెప్పారు. అదే సమయంలో తమ స్ధానాల్లో తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలని చేసుకున్న అభ్యర్ధనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. దాంతో వారి వారసులకు టిక్కెట్లు ఖాయమైనట్లే.
కెఇ శ్యాంబాబుకు ఓకే
ఉప ముఖ్యమంత్రి, కర్నూలు జిల్లాలో సీనియర్ నేత కెఇ కృష్ణమూర్తి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం లేదని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. తన స్ధానంలో కుమారుడు కెఇ శ్యాం బాబు పోటీ చేయబోతున్నట్లు కూడా కెఇ బహిరంగంగానే ప్రకటించారు. అయితే, ఇక్కడే చిన్న విషయముంది. అదేమిటంటే, తన కొడుకు విషయంలో కెఇ బహిరంగ ప్రకటన చేసే ముందే అదే విషయాన్ని చంద్రబాబుతో చెప్పి అనుమతి తీసుకున్నారు.
గౌతు శిరీష ఖాయమే
ఇక, శ్రీకాకుళం జిల్లాలో పలాస నియోజకవర్గంలో కూడా ఇదే వరస. సిట్టింగ్ ఎంఎల్ ఏ గౌతు శ్యాం సుదర శివాజీ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని ఇప్పటికే ప్రకటించేశారు. తనకు బదులుగా తన కూతురు శిరీష పోటీ చేస్తుందన్నారు. అందుకు చంద్రబాబు దగ్గర ముందుగానే అనుమతి తీసుకున్నారు. అంటే పై ఇద్దరి వారసుల పోటీ విషయంలో ఎటువంటి సమస్య లేదు.
పెండింగ్ లో జెసి వారసులు
మరి అదే సమయంలో చిక్కంతా అనంతపురంలో జెసి బ్రదర్స్ ప్రకటన విషయంలోనే మొదలైంది. వచ్చే ఎన్నికల్లో తమకు బదులుగా తమ వారసులు అనంతపురం ఎంపిగాను, తాడిపత్రి ఎంఎల్ఏగాను పోటీ చేస్తారని జెసి దివాకర్ రె్డి, జెసి ప్రభాకర్ రెడ్డి చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. జెసి బ్రదర్స్ వారసుల విషయాన్ని చంద్రబాబు పెండింగ్ లో ఉంచారట. ఎందుకంటే తనకు మాటమాత్రం కూడా చెప్పకుండానే తమంతట తాముగా ప్రకటన చేసిన కారణంగా వారి విషయాన్ని చంద్రబాబు పెండింగ్ లో ఉంచారట.