ముందస్తు ఎన్నికలు - కెసిఆర్ చంద్రబాబు - ఒకరు ఉత్తరం మరొకరు దక్షిణం

ప్రజలు ఎన్నికైన తమ ప్రతినిధులకు ఐదేళ్ళకు మాండేట్ యిచ్చి పరిపాలించమని, తమకు సేవలు చేయమని కొరారు. అయితే ఈ రాజకీయ నాయకుల్లో అధికార మధం నెత్తికెక్కి వారిలో స్వార్ధం తైతక్కలేస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ వెర్రే అధికార పార్టీ అధినేతల నేత్తి కెక్కి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ “ముందస్తు ఎన్నికలు” అనే అంశం దేశ రాజకీయాల్లో కూడా అలజడి సృష్టిస్తున్నాయి. 

“ముందస్తు ఎన్నికలు” అనే అస్త్రాన్ని వ్యూహంగా మార్చి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరెంద్ర మోడీని తన డిల్లీ పర్యటనలో సందర్శించారని దేశమంతా ప్రచారం జరుగుతూనే ఉంది. దీంతో దేశవ్యాప్తంగా 'ముందస్తు ఎన్నికల ఫీవర్' మొదలై చర్చలు రాజుకుంటున్నాయి. ఒక్కసారిగా దేశంలో ముందస్తు ఎన్నికల సీజన్ మొదలైనట్లు అనిపిస్తుంది.  

దేశం లోని అన్నీ రాష్ట్రాల సంగతి పక్కనబెట్టి తెలంగాణా పొరుగు రాష్ట్రమైన  ఆంధ్రప్రదేశ్ లోనూ ముందస్తు ఎన్నికల అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగటాన్ని పరిశీలిస్తూనే ఉంది.  ముఖ్యంగా ఏపిలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇక్కడ ఎన్నికల్లో పొత్తులపై అధినేత నారా చంద్రబాబు నాయుడు మాటను కూడా కాదంటూ ఒక రకంగా ధిక్కరిస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్న నేతలు ముందస్తు ఎన్నికలకు వెళ్తే, అధికార పార్టీ  పరిస్థితి ఎలా? ఉంటుంది అనే అంశంపై కూడా చర్చించు కుంటున్నారు. 

అయితే రెండు రాష్ట్రాలకు ఈ విషయంలో ఒక తేడా ఉంది - తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు స్వయంగా ప్రభుత్వమే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర ప్రస్తావిస్తే ఆయన “ససేమిరా” అంటూ   కథ నడిపిస్తున్నారు. అయితే  చంద్రబాబు నిర్ణయానికి ఫ్లాష్ బాక్ కూడా ఉంది. 

2004ఎన్నికల్లో కేంద్రంలో వాజపేయి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ ప్రభుత్వాలు “ముందస్తు ఎన్నికల” కు వెళ్లాయి. ఆ సమయంలో కేంద్రంతో పాటు ఇరు రాష్ట్రాలు ముందస్తు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నాయని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తుందని అలాంటి తరుణంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సరైన చర్య కాదని  చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

లోటుబడ్జెట్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చెయ్యడంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉందని కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా వెనకాడకుండా ముందుకు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. గత అనుభవం దృష్ట్యా ముందస్తు కెళ్తే తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని, 2004 ఫలితాలే పునరావృతమవుతాయని అనేక మంది టిడిపి నేతలు అభిప్రాయ పడుతున్నారట. 

వ్యూహంలో భాగమే వైసిపి నుండి టిడిపి లోకి వలసలకు ప్రోత్సాహం 

తెలుగుదేశం పార్టీ దాదాపుగా పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి 2014 ఎన్నికల్లో చచ్చీచెడి అధికారంలోకి వచ్చింది. ఆందుకే పార్టీని నమ్ముకుని నేతలు, కార్యకర్తలు పదేళ్ళపాటు అంటి పెట్టుకుని ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి చెందిన నేతలకు “నామినేటెడ్ పదవులు” ఇచ్చి వారికి ఊరట ఇస్తారని అందరూ భావించారు. అయితే  వైసిపిని రాజకీయంగా అంతమొందించేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధం చేసిన కుట్ర ప్రణాళిక దాదాపు గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి వలసలను ప్రోత్సహించారో, అదే తీరును చంద్రబాబు నాయుడు ఈ ప్రణాళికా కాలంలో అమలు పరిచారు. 


వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో చిన్నచిన్న పదవుల్లో ఉన్న నేతలను సైతం తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ వలసలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అంతే కాదు వైసీపీ నుంచి గెలుపొంది, టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల ను సైతం కట్టబెట్టారు. దీంతో ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని ఉన్న అసలు సిసలు టిడిపి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు.  అవి సరిపోవన్నట్లు వైసీపీకి చెందిన కొంత మందికి నామినేటెడ్ పదవులను సైతం కట్టబెట్టారు. దీంతో పదవులు ఆశించే కొంత మంది టీడీపీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తొమ్మిదేళ్ల పాటు పార్టీ జెండాను ఏ ప్రతిఫలాపేక్ష లాభాపేక్ష లేకుండా పార్టీని భుజాన పెట్టుకుని మోస్తే, ఇప్పుడు అధికారంలోకి రాగానే పార్టీ తమకేమిచ్చిందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు...

వైసీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించిన నేపథ్యంలో టిక్కెట్ల కేటాయింపులో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో కొత్తచర్చ మొదలైంది. టీడీపీనే నమ్ముకుని అంటిపెట్టుకుని ఉన్న నేతలను కాదని వైసిపి నుండి వలస వచ్చిన నేతలకు టిక్కెట్లు ఇస్తే పార్టీకి తీరని నష్టం ఏర్పడుతుందని టీడీపీ అంచనా వేస్తుంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, ఎన్నికల సమరానికి టీడీపీ సిద్ధం అని చెప్తున్నా, పార్టీలోని అంతర్గత పోరాటాలు రాజుకుంటే ఎలా చక్కదిద్దుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతుంది.  


ఈసారి ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుల్లో టిడిపి అధినేతకు పెద్ద తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది. వైసీపీని కాదని టీడీపీలోకి వచ్చిన నేతలకు టిక్కెట్ ఇస్తే టీడీపీ నేతల్లో అసంతృప్తి, టీడీపీని కాదని వైసీపీ నుంచి వచ్చిన నేతలకు టిక్కెట్ ఇస్తే మళ్లీ వైసీపీ లోకి తిరిగి వెళ్లిపోతే పరిస్థితులు తారుమారయ్యే ప్రమాదం ముంచుకు రావచ్చు. ‘ముందు గొయ్యి వెనుక నుయ్యి ‘ అన్న తీరునున్న టీడీపీ పరిస్థితి  “కుడితిలో పడ్డ ఎలుకలా“ తయారైంది. 

టిక్కెట్ల విషయంలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉండబోతుందని రాజకీయ విశ్లేషకుల మాట. ఇన్ని సమస్యలు ఉన్న నేపథ్యంలో ముందస్తుకు వెళ్తే కొంప మునిగి పోతుందని భావించిన టీడీపీ ముందస్తు ఎన్నికల ప్రస్తావనను కనీసం పలకటానికి దాని గురించి చర్చకు గాని ఇష్టపడటం లేదు.   ఎన్నికల యుద్ధానికి సరిగా ఆరునెలల ముందు నుంచి వరాలజల్లు ప్రకటించడంతో పాటు ప్రజలకు తాయిలాలు పంచి ఆకట్టుకోవచ్చని, అదే ముందస్తు అయితే ఆ అవకాశం తమకు ఉండబోదని టిడిపి భావిస్తుంది 

మరోవైపు వైవైసిపి ముందస్తు ఎన్నికలకు సర్వదా సిద్ధం అంటోంది. వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైసీపీలోనూ అంతర్గత సమస్యలు విభేదాలు  ఉన్నప్పటికీ అధికారపార్టీపై  ఉన్న వ్యతిరేకతను సొమ్ము  చేసుకోవటం ప్రాధమ్యం సంతరించుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ ముందస్తు ఎన్నికలు జరిగినా,  మామూలుగా ప్రణాళిక ప్రకారం ఎన్నికలు జరిగినా, గెలుపు మాత్రం వైసీపీదేనని ఆ పార్టీ పూర్తి విశ్వాసంతో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: