ఇపుడిదే ప్రశ్న నిజమైన జగన్మోహన్ రెడ్డి అభిమానులను పట్టి పీడిస్తోంది. పోయిన ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుని మరీ ఉలిక్కిపడుతున్నారు. పోయిన ఎన్నికల్లో కూడా సర్వేలు, జనాభిప్రాయం మొత్తం జగన్ వైపే నిలిచిందన్న విషయం మరచిపోకూడదు. తీరా ఎన్నికల తర్వాత వెల్లడైన ఫలితాల్లో చంద్రబాబునాయుడు సిఎం అయ్యారు. మెజారిటి ప్రజాభిప్రాయం జగన్ సిఎం కావాలనుంటే అయ్యింది మాత్రం చంద్రబాబు. అసలు మతలబంతా ఇక్కడే ఉంది.
పోయిన ఎన్నికల్లో తప్పులు
ఎన్నికల ముందు వరకూ నిర్వహించిన ప్రతీ సర్వేలో కాబోయే సిఎం జగన్ అని వస్తుండటంతో అదే ఎన్నికల తీర్పుగా వైసిపి నేతలు భావించారు. దాంతో చాలా లీజర్ గా రాజకీయాలు చేయటం మొదలుపెట్టారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల్లో గెలుపుకోసం తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. అభ్యర్ధుల ఎంపికలో జగన్ చేసిన తప్పులు కూడా చాలా ఉన్నాయి.
చంద్రబాబు ప్లస్సులు
ప్రత్యర్ది పార్టీ చేసిన తప్పులను అవకాశంగా తీసుకుని సమయం చూసి దెబ్బకొట్టటం ద్వారా చంద్రబాబు సిఎం అయిపోయారు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే జగన్ ను ఎదుర్కొనటం కష్టమని చంద్రబాబు గ్రహించారు. అందుకే అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. చీ కొట్టినా వదలకుండా వెంటపడి బిజెపితో పొత్తులు పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్ ను మాయ చేసి దారిలోకి తెచ్చుకున్నారు. ఆచరణ సాధ్యం కాదని తెలిసి వందలాది హామీలిచ్చారు. మొత్తం మీద లక్ష్యాన్ని చేరుకున్నారు. అన్నింటికీ మించి మెజారిటీ మీడియాను గుప్పిట్లో ఉంచుకున్నారు.
5 శాతం తేడా ఎక్కువేమీ కాదు
పోయిన ఎన్నికల్లో చేసిన తప్పులు మళ్ళీ జరక్కుండా జగన్ జాగ్రత్తగా ప్లాన్ వేసుకోవాలి. నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను పోటీలోకి దించాలి. పోలింగ్ రోజు చివరి గంట వరకూ అభ్యర్దులు, నేతలు సమన్వయంతో తెలివిగా పనిచయాలి. సర్వేల్లో అంత మనకు అనుకూలంగా ఉంది కదా అనుకుంటే మళ్ళీ బోల్తాపడటం ఖాయం. ఇండియా టుడే సర్వే ప్రకారం 2019లో ముఖ్యమంత్రిగా జగన్ ఉండాలని కోరుకుంటున్న వారు 43 శాతం. చంద్రబాబే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నవారు 38 శాతంమంది. అంటే ఇద్దరి మధ్య తేడా కేవలం 5 శాతం మాత్రమే. ఈ 5 శాతం తేడాను అధిగమించటం చంద్రబాబుకు చాలా ఈజీ.
ప్రత్యర్ధిని గట్టి దెబ్బ కొట్టగలిగితేనే ?
సర్వేలో గమనించాల్సిన విషయం ఏమిటంటే సిఎంగా ఎవరుండాలో తేల్చుకోలేని వారి శాతం 14 . అంటే చాలా ఎక్కువనే అనుకోవాలి. బహుశా వారంతా రాజకీయాలతో సంబంధం లేనివారే అయ్యుండొచ్చు. 14 శాతంలో ఎక్కువమందిని ఇద్దరిలో ఎవరు ఆకట్టుకుంటే వారు లాభపడచ్చు. కాబట్టి జగన్ ఆ విషయాన్ని గుర్తుంచుకుని తటస్తులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాలి. తాను సేఫ్ గా ఉన్నానుకోవటమే కాదు ప్రత్యర్ధిని గట్టి దెబ్బ కొట్ట గలిగితేనే జగన్ లక్ష్యాన్ని చేరుకోగలరు.