ఎడిటోరియల్ : ఇద్దరు చంద్రులది బురద రాజకీయమేనా ?

Vijaya

విచిత్రమేమిటంటే తెలుగురాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులిద్దరూ చంద్రులే. ఒకరు చంద్రబాబునాయుడు, మరోకరు కె. చంద్రశేఖర్ రావు. పేర్లలో తప్ప ఇంతకాలం మరెందులోనూ ఇద్దరికీ సారూప్యత కనిపించలేదు. అయితే, ముందస్తు ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన కెసియార్ కు, ఎన్నికల హీట్ పెరిగిపోయిన ఏపిలో చంద్రబాబుకు మధ్య కొత్తగా ఒక సారూప్యత కనిపిస్తోంది. అదేమిటంటే ప్రత్యర్ధులపై యధాశక్తి బురద చల్లేయటం. ఇద్దరు చంద్రులు తమ రాష్ట్రాల్లో మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకున్నారు కదా ? అందుకే మీడియా మద్దతుతో బురదచల్లుడు కార్యక్రమం యధేచ్చగా సాగించేస్తున్నారు.

 

ముందుగా తెలంగాణా విషయం తీసుకుందాం. తొమ్మిది నెలల ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్న కెసియార్ తెరవెనుక ఏదో పెద్ద వ్యూహంతోనే ముందస్తుకు వెళ్ళారన్నది వాస్తవం. ఎన్నికల్లో గెలుపుకోసం ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి కదా ? అందులో భాగంగానే  కాంగ్రెస్, టిడిపి పొత్తు పెట్టుకున్నాయి. ఆ పొత్తును కెసియార్ ఏమాత్రం జీర్ణించుకోలేకున్నారు.  అందుకే రెండు పార్టీలను, చంద్రబాబును వ్యక్తిగతంగా అమ్మనాబూతులు తిడుతున్నారు. పొత్తులు అనైతికమట. చంద్రబాబుది ఐరన్ లెగ్ ట. సరే రెండు పార్టీలను తిట్టని తిట్టు లేదులేండి.

 

ఇక్కడ విచిత్రమేమిటంటే ఇదే కాంగ్రెస్ తో ఒకసారి, ఇదే చంద్రబాబుతో మరోసారి ఇదే కెసియార్ పొత్తులు పెట్టుకున్నారు. అప్పుడు దోస్తీ చేయటానికి పనికొచ్చిన పార్టీలే ఇపుడు దుష్మన్ గా కనిపిస్తున్నాయ్. అంటే ఏమటర్ధం ? తనతో ఉంటే మంచివైనట్లు లేకపోతే ఇక తిట్టటమే. కెసియార్ తిట్లలో ఎక్కువగా కాంగ్రెస్, టిడిపి పొత్తుపై భయమే కనబడుతోంది. అందుకనే చంద్రబాబును అంత అసహ్యంగా తిడుతూ మళ్ళీ తెలంగాణా సెంటిమెంటును రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఇక, ఏపి విషయం చూస్తే చంద్రబాబుది కూడా డిటోనే. నాలుగున్నరేళ్ళ పాలనలో చేసిందేమి లేదు. కాబట్టి చెప్పుకునేందుకూ లేదు. అందుకనే జరగని అభివృద్ధిని జరిగినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో పోయిన ఎన్నికల్లో మిత్రులుగా ఉన్న బిజెపి, పవన్ కల్యాణ్ ఇపుడు చంద్రబాబును వదిలేసి సొంతకుంపట్లు పెట్టుకున్నారు. దానికితోడు నాలుగున్నరేళ్ళ పాలనలో జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకత. అందుకనే తన వైఫల్యాలను వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్రప్రభుత్వం మీదకు నెట్టేసి కాలం గడుపుతున్నారు.

 

తనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి కుట్రలు చేస్తున్నట్లు చంద్రబాబు  పదే పదే చెప్పుకుంటున్నారు. జనాల సానుభూతిని రగల్చి లబ్దిపొందేందుకు విపరీతంగా కష్టపడుతున్నారు. దానికి మీడియా మద్దతుందనుకోండి అది వేరే సంగతి. వ్యాపారస్తులు, వివిధ సంస్ధలపై జరిగిన ఐటి దాడులను చంద్రబాబు, టిడిపి గగ్గోలు పెడుతుండటం కూడా అందులో భాగమే. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవ్వటానికి బిజెపి, పవన్ ఎక్కడ సహకరిస్తాయో ? జనాలు కూడా జగన్ మాటలను ఎక్కడ నమ్మేసి అధికారం  అప్పగించేస్తారో ? అన్న అనుమానంతోనే ప్రతీ రోజు తన మీడియా ద్వారా జగన్ పై బురదచల్లేస్తున్నారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే జగన్ అంటే భయపడుతున్నట్లే అనుమానం వస్తోంది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: