హైదరాబాద్: ఇప్పుడు అందరి నోట జూన్ 15 మాటే. నలుగురు గుమి గూడితే చాలు జూన్ 15 గురించి మాట్లాడుకుంటున్నారు. యావత్ ప్రజానీకం జూన్ 15 కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుస్తోంది. జూన్ 15 రావడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. అందరూ 15గురించి ఎదురు చూడటానికి కారణం లేకపోలేదు. రాష్ర్ట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు పార్లమెంటు స్థానంతో పాటు తెలంగాణలోని పరకాల, సీమాంధ్రలోని 17 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు జూన్ 15న వెలువడున్నాయి. అత్యంత ఖరీదైన ఎన్నికలే కాకుండా, రాష్ర్టంలోని పలు ప్రధాన పార్టీల నాయకుల భవిష్యత్ ఈ ఉప ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉండటమే జూన్ 15కు ఉన్న ప్రాధాన్యత. ఉప ఎన్నికల ఫలితాల తరువాత అనేక మంది నేతల తలరాతలు మారబోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాదు, జూన్ 15తరువాత పదవుల్లో ఉండేదెవరు? ఊడేదెవరు? అనే దానిపై రాజకీయ వర్గాల్లో రసవత్తరమైన చర్చ సాగడమే కాదు,గెలుపోటములపై కోట్లాది రూపాయల బెట్టింగులు కూడా కట్టినట్లు తెలుస్తోంది. 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికలు ఈ ఉప ఎన్నికలు సెమీ ఫైనల్‌గా చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే రాష్ర్టంలోని అన్ని పార్టీలకు ‘పరీక్ష’వంటివనే చెప్పాలి. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికలు కొత్తగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ పార్టీతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ మనుగడకు ఎంత ముఖ్యమో, వరుసగా రెండు పర్యాయాలు అధికారాన్ని పోడగొట్టుకుని, ఇటీవల తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని విధంగా చతికిలపడిన టీడీపీ నేత చంద్రబాబుకూ, నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోన్న కాంగ్రెస్ పార్టీకీ అంతే. ముఖ్యంగా ఇటీవలనే తన ప్రజారాజ్యంను కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్యసభ సీటును ప్రమోషన్‌గా కొట్టేసిన చిరంజీవికి పరువుతో కూడుకున్నదని చెప్పాలి. టీఆర్ఎస్కు ప్రతిష్టతో కూడుకున్నదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగిన పాలమూరు ఉప ఎన్నికల్లో బీజేపీ చేతిలో టీఆర్ఎస్ ఓటమిని చవి చూసింది. తాజాగా జరుగుతున్న పరకాల ఉప ఎన్నికల్లోనూ పాలమూరు ఫలితమే వస్తే తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థతి కొంత ఆగమ్యగోచరంగా మారడం ఖాయమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైన్లకు ముందు జరిగే సెమీ ఫైన్లగా భావించడంతోనే అన్ని పార్టీల నేతలు సర్వశక్తులొడ్డి మండుతున్న ఎండల్ని సైతం లెఖ్క చేయకుండా తమ ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలతో పాటు కడప, పులివెందుల, కొవ్వూరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అటు జగన్ చేతిలో, ఇటు కేసీఆర్ చేతిలో ఘెరపరాజయాన్ని చవి చూసింది. అయితే, ఆ ఎన్నికల్లో అటు, ఇటు సింపతీ బాగా పనిచేసిందనీ కాంగ్రెస్ అధిష్టానం స్థానిక నాయకత్వంపై ఎలాంటి ‘చర్య’లు తీసుకోకుండా వదిలిపెట్టింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. సీమాంధ్రలో జగన్ అరెస్టు ద్వారా వైఎస్ఆర్ పార్టీ దూకుడుకు బ్రేకు వేయవచ్చని భావించి కాంగ్రెస్ కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నదని తాజా సర్వేలు, ఓటరు నాడి, పోలింగ్ జరిగిన తీరు చెబుతోంది. జగన్ అరెస్టు తరువాత న ఆమె తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ప్రచార బాధ్యతలు చేపట్టారు. ప్రజా క్షేత్రంలోకి దిగారు. తల్లీకూతుళ్లకు ప్రజల నుంచి సీమాంధ్రలోనే కాదు, తెలంగాణలోనూ ఊహించని ఆదరణ లభించింది. జగన్ అరెస్టు ద్వార రాజకీయ లబ్ది పొందాలనుకున్న కాంగ్రెస్ బొక్కబోర్లా పడ్డదనే అభిప్రాయాన్ని పలువురు(సర్వేలూ ఇదే చెబుతున్నయి కూడా) వ్యక్తం చేశారు. రాష్ర్టంలో కోల్పోయిన అస్థితత్వాన్ని తిరిగి ఎలాగైనా పొందాలనే కాంగ్రెస్ లోని హేమాహేమీలు ప్రచారాన్ని నిర్వహించారు . ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అథిరథమహారథులందరూ దిగారు. ప్రచారాన్ని నిర్వహించారు. కానీ, ఓటరు నాడిని మాత్రం పట్టలేకపోయారు. ఫలితాలు తాము ఊహించిన విధంగా లేవనీ ప్రచారం ముగియడంతోనే కాంగ్రెస్ పెద్దలు వచ్చారు. దీనితో కాంగ్రెస్‌లో ఉప ఎన్నికల తరువాత అనేక మార్పులు చోటుచేసుకోవడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఇక టీడీపీ పరిస్థితి గురించి వేరే చెప్పనక్కర్లేదు. అన్నీ తానై చంద్రబాబు ప్రచారాన్ని నిర్వహించాడు. కానీ, ఫలితం తమకు అనుకూలంగా ఉండేటట్లు లేదనే అభిప్రాయానికి వారు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలన్నీ జగన్ అవినీతి గురించి ప్రచారం నిర్వహించాయి. జైల్లో ఉన్న జగన్ పార్టీకి ఓట్టేస్తే రాష్ర్టాన్ని అమ్ముకుంటాడనీ ప్రచారాన్ని చేశారు. కానీ, ఆ పార్టీల ప్రచారాన్ని ఓటర్లు అంతగా నమ్మినట్టు లేదు. మొత్తానికి ఓటరన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ పార్టీ మెజార్టీ సీట్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి మరికొందరు శాసనసభ్యులు జగన్ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నరు. ఇదే గనుక జరిగితే కాంగ్రెస్ లోని పలువురి సీట్లకు ఎసరు రావడం, చిరంజీవి భవిష్యత్ కూడా మారడం తథ్యం. అంతే కాదు,జగన్ ఆశించిన సీట్లు రాకపోతే కూడా ఆయన భవిష్యత్ కూడా అంధకారంగా మారుతోంది. మొత్తానికి జూన్ 15తరువాత రాష్ర్టంలో రాజకీయంగా అనేక చేర్పులు,మార్పులు చోటుచేసుకోవడం ఖాయమని పరిశీలకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు కూడా అవే సంకేతాలు ఇస్తున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: