సుహాసినికి మంత్రి పదవి.. కేటీఆర్ హాట్ కామెంట్..

Chakravarthi Kalyan

కూకట్ పల్లి... ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో అత్యధికంగా డిస్కషన్ జరుగుతున్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి. సాధారణంగా టీఆర్ఎస్ అవలీలగా గెలవాల్సిన నియోజక వర్గం ఇది. ఆంధ్రా నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. కానీ ఆ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో కి వలస వచ్చేయడంతో ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చింది.



మళ్లీ ఇప్పుడు అదే ఎమ్మెల్యే టీఆర్ఎస్ తరపున పోటీకి దిగుతుండటంతో ఆయన గెలుపు ఖాయం అని అనుకున్నారు. కానీ టీడీపీ అధినేత అనూహ్యంగా నందమూరి హరికృష్ణ కూతురుని బరిలో దింపడం వల్ల ఒక్కసారిగా సీన్ మారిపోయింది. టీడీపీ ఈ సీటును ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీఆర్ఎస్ కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ కూకట్ పల్లిలో గులాబీ జెండా ఎగరేయాలని భావిస్తోంది.



అందుకే కేటీఆర్ ఈ నియోజకవర్గంపై ఎక్కువగా దృష్టి సారించారు. అంతేకాదు.. నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని రాజకీయంగా తొక్కేసేందుకే సుహాసినికి ఓడిపోయే కూకట్ పల్లి సీట్ ఇచ్చారని విమర్శిస్తున్నారు. సుహాసిని ఓటమి ద్వారా హరికృష్ణ కుటుంబానికి అంత ప్రాభవం లేదని చంద్రబాబు చెప్పాలని చూస్తున్నారని కేటీఆర్ అంటున్నారు.



సుహాసినికి రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వదలచుకుంటే.. ఆమెకు ఏపీలోనే లోకేశ్ తరహాలోనే మంత్రి పదవి ఇవ్వవచ్చు కదా అని కేటీఆర్ కామెంట్ చేశారు. ఆమెకు ఓ ఎమ్మెల్సీ సీటు ఇచ్చి మంత్రి పదవి ఇస్తే హరికృష్ణ ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇచ్చినట్టవుతుందని.. కానీ చంద్రబాబు కావాలనే ఆమెకు కూకట్ పల్లి టికెట్ ఇచ్చి రాజకీయంగా ఇబ్బందిపెడుతున్నారని కేటీఆర్ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: