నోట్ల కట్టలు.. మద్యం బాటిళ్లు..చీరలు.. దావత్ లు..ఈ ఎన్నికలు చాలా కాస్ట్ గురూ..!!

Vasishta
మరికొన్ని గంటల్లో తెలంగాణలో పోలింగ్ ప్రారంభం కానుంది. ప్రచారానికి ముగింపు పలకడంతో తెరవెనుక లాబియింగ్ ముమ్మరం చేశారు అభ్యర్థులు. తమ గెలుపు కోసం అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగిస్తున్నారు. ఇప్పటికే పెద్దఎత్తున డబ్బు పంపిణీ జరిగిపోయింది.. ఈ రాత్రికి మిగిలిన టార్గెట్లు కూడా పూర్తి చేసే పనుల్లో పార్టీలు, అభ్యర్థులు మునిగిపోయారు.  తెలంగాణలో వార్ వన్ సైడ్ ఖాయం అని నిన్నమొన్నటిదాకా వినిపించే మాట. అయితే ఇప్పుడు ప్రజాకూటమి గట్టిపోటీ ఇవ్వడం ఖాయమని సర్వేల్లో తేటతెల్లమైపోయింది. ఆక్టోపస్ గా పేరొందిన లగడపాటి టీఆర్ఎస్ ఓటమి దాదాపు ఖాయమనే సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ మళ్లీ అధికారంకోసం చివరి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అటు ప్రజాకూటమి కూడా కలసికట్టుగా టీఆర్ఎస్ ను గద్దె దించేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది.


గత ఎన్నికలతో పోల్చితే ఇవి ఖరీదైన ఎన్నికలుగా మారనున్నాయి. సగటున ఒక్కో నియోజకవర్గానికి రూ.30 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నట్టు సమాచారమందుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో డబ్బు పంపిణీ విచ్చలవిడిగా సాగుతోంది. సుమారు 30-40 నియోజకవర్గాల్లో ఖర్చు రూ.30కోట్ల పైమాటేనని తెలుస్తోంది. 10 నియోజకవర్గాల్లో ఈ ఖర్చు రూ.50 కోట్లు దాటినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదనిఅంచనా వేస్తున్నారు. ఒక్కో ఓటుకు కనీసం రూ.500 నుంచి రూ.2000 వరకూ పంచుతున్నారు. 


మరోవైపు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని గమనించిన ఎన్నికల సంఘం వాటికి అడ్డుకట్ట వేసేందుకు గట్టిగానే కృషి చేస్తోంది. నిఘా పెట్టి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తోంది. ఇప్పటివరకూ రూ.137 కోట్ల రూపాయల నగదును సీజ్ చేసినట్లు ఎన్నికల సంఘం వివరించింది. బుధవారం ఒక్కరోజే రూ.7.5 కోట్ల నగదు పట్టుబడింది. హైదరాబాద్ లో ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర రావు ఇంటి వెనుకభాగంలో రూ.17.5 లక్షల నగదు పట్టుబడింది.  బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత యాదాద్రి జిల్లా ఆలేరు చెక్ పోస్ట్ వద్ద రూ.13.3 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. 
మరోవైపు పలు జిల్లాల్లో విందు రాజకీయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సాయంత్రమయ్యే సరికి పార్టీల్లో మునిగిపోతున్నారు.

గ్రామాల్లో పార్టీలవారీగా విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇంటింటికీ చికెన్ పంపిణీ చేశారు. మద్యం ప్రియులందరికీ రోజూ మద్యం బాటిళ్లు సరఫరా చేస్తున్నారు. యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. మహిళలకు చీరలు, వెండి కుంకుమ భరిణెలు పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లాలో ఓటుకు రూ.2వేల వరకూ పంపిణీ చేసినట్లు సమాచారముంది. హైదరాబాద్ లో ఇంటికింత అన్నట్టు నగదు పంచుతున్నారు. ఇంట్లో 5-10 ఓట్లు ఉంటే గంపగుత్తగా రూ.10వేల వరకూ ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: