కేసీఆర్ విర్రవీగుతున్నాడు.. చంద్రబాబు నిప్పులు..

Chakravarthi Kalyan

తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడుపై ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. దేశ రాజకీయం మారుస్తా.. అంటూ ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశంలోనే సీనియర్ పొలిటిషియన్ అయిన చంద్రబాబుకు కోపం తెప్పిస్తున్నాయి. అందుకే సమయం వచ్చినప్పుడు కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా.. చంద్రబాబును ప్రజావేదికలో ఇటీవల తెలంగాణలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు కలిసిన సమయంలో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.



తెలంగాణాలో గెలుపుతో కేసీఆర్ విర్రవీగుతున్నాడని ఏపీ సీఎం మండిపడుతున్నారు. కేసీఆర్ ఏకంగా ప్రధాని మోడీ, రాహుల్ లకు రాజకీయాలను నేర్పుతాననటం ఆయన విజ్ఞతకే వదిలేద్దామన్నారు చంద్రబాబు. ఫెడరల్ ఫ్రంట్ నెలకొల్పి దేశాన్ని మారుస్తానని కేసీఆర్ ప్రగల్బాలు పలుకుతున్నాడని.. తానే మేధావినని కేసీఆర్ ఫోజులు కొడుతున్నాడని చంద్రబాబు అన్నారు.



సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ,అశ్వారావు పేట ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు తెలంగాణలో గెలిచాక అమరావతి వెళ్లి చంద్రబాబును కలిశారు. అభివృద్ధి పనులు చేయడంతోపాటు ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటంతోనే సండ్ర వెంకట వీరయ్య, నాగేశ్వరరావుల గెలుపు సాధ్యమైందన్నారు చంద్రబాబు. అభివృద్ధి పట్ల శ్రద్ధ వహించే తెలుగుదేశం పార్టీని, ఇతర పార్టీలతో భేరీజు వేసుకుని ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.



కేసీఆర్ బ్లాక్ మెయిలింగ్, తిట్టడమే ధ్యేయంగా రాజకీయాలు సాగించడం సబబుకాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్ , పవన్ , ఎంఐఎమ్ లతో కేసీఆర్ కుమ్మక్కయ్యాడని.. ఇలాంటి తప్పుడు రాజకీయలను ప్రజలు హర్షించరని ఆయన అన్నారు. తెలంగాణాలో ఓటమిపై సమీక్ష చేసుకుని భవిషత్తులో ముందుకు ఎలా వెళ్ళాలో దిశానిర్దేశం చేస్తానని సీఎం తెలిపారు. ఐతే.. తెలంగాణలో ప్రజాతీర్పు వచ్చాక కూడా ఇంకా కుమ్మక్కు రాజకీయాలని చంద్రబాబు విమర్శించడంలో అర్థమేంటో ఆయనకే తెలియాలంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: