ఓటుకు నోటు కేసు మలుపులు తిరగ బోతుందా ... ఆ ఎమ్మెల్యే బాబును ఇరికిస్తాడా ..!

Prathap Kaluva

ఆంధ్ర ప్రదేశ్ లో ఓటుకు నోటు కేసు ఎంత సంచలనం రేపిందో మనకందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కేసు ఎంత వరకు వచ్చిందో ఎవరికీ తెలియడం లేదు . అయితే విషయం ఏంటంటే.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్ లతో పాటు సండ్ర వెంకటవీరయ్య కూడా నిందితుడే. రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మొన్నటిదాకా చాలా దూకుడుగానే కేసీఆర్ మీద దాడిచేస్తూ వచ్చాడు గానీ.. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో ఇక ఆయన తీరు ఎలా మారుతుందో చూడాలి.


అసలే కొడంగల్ లో ఓడితే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరిన రేవంత్ దానికి కట్టుబడతాడో లేదో కూడా చూడాలి. ఇదొక ఎత్తు అయితే.. ఓటుకు నోటు కేసులో ఈ ముగ్గురు నాయకులు కీలకం కాగా, సండ్ర ఇప్పుడు గులాబీ గూటికి చేరడం ఈ ముగ్గురికీ ప్రమాద ఘంటికే అనుకోవాలి. సాధారణంగా అయితే.. ఖమ్మంజిల్లాలో తెరాస బలహీనంగా ఉన్నట్లు ఈ ఎన్నికల్లో తేలింది గనుక.. అక్కడ పార్టీని బలోపేతం చేసుకోడానికే ఈ చేరిక అనుకోవాలి. కానీ గులాబీ పార్టీలోకి వచ్చిన తర్వాత.. సండ్రకు ఏదైనా పెద్దపదవి దక్కినా.. అందలం ఎక్కించినా.. దానికి మించిన స్కెచ్ ఏదో వారి మదిలో ఉన్నదని అనుకోవాలి.


ఇప్పుడు ఓటుకు నోటు కేసును తిరగతోడడం అంటూ జరిగితే.. గులాబీ గూటికి చేరిన చిలక గనుక.. సండ్ర ఆ గూటి పలుకులే పలుకుతుందనడంలో సందేహంలేదు. ఆయన అటువైపు మాట్లాడితే చంద్రబాబుకు, రేవంత్ కు కూడా చిక్కులు తప్పవు. అసలే చంద్రబాబు ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా ఒక సాక్ష్యంగా ఇప్పటికే ఉంది. ఈ నేపథ్యంలో సండ్ర పోక వలన.. ఓటు నోటు కేసు గుదిబండగా మారి మెడకు చుట్టుకుంటుందని చంద్రబాబు భయపడుతున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: