ఆ ఎన్నికల గుర్తు.. పవన్‌కు మైనస్ కానుందా..?
2019 ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన 29 పార్టీలకు కూడా ఎన్నికల చిహ్నాలను ఇచ్చిన ఈసీ జనసేనకు గాజు గ్లాస్ గుర్తు ఇచ్చింది.
2019లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు ఈ గుర్తుపై పోటీ చేయవచ్చు. ఐతే.. ఈ ఎన్నికల గుర్తుపై కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. ఇది ప్రజలను అంతగా ఆకట్టుకునే గుర్తు కాదని వారు భావిస్తున్నారు. ఎన్నికల సభల్లో చెప్పుకునేందుకు.. ఇది అంత అనువుగా ఉండదన్నది వారి అభిప్రాయం.
ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌లకు ఉన్న గుర్తులతో పోలిస్తే గాజు గ్లాసు అంతగా ఆకట్టుకునే పరిస్థితి లేదు. గాజు గ్లాసుతో పెద్దగా ఉపయోగాలు కానీ.. పోలికలు కానీ చెప్పే అవకాశం లేదు. అంతే కాకుండా.. ప్రత్యర్థులు సులభంగా ఈ గుర్తును సులభంగా విమర్శించే ఛాన్సుంది.
గాజు గ్లాసు సున్నితంగా ఉంటుంది. సులభంగా పగిలిపోతుంది. అందులోనూ నిత్యావసర వస్తువు కాదు.. ఇలా ఇన్ని మైనస్‌లు ఉన్న గుర్తు వచ్చిందేమింటా అని జనసేన శ్రేణులు తలపట్టుకుంటున్నాయి. ఐతే.. జనం తలచుకుంటే ఎన్నికల గుర్తు ఏదైనా ఓట్లు గుద్దేస్తారని మరికొందరు ఆశావాదులైన కార్యకర్తలు నమ్మకంగా ఉన్నారు.