బాబుది చిల్లర రాజకీయం..లగడపాటి 420.. తెలంగాణ మంత్రి రుసరుసలు..

Chakravarthi Kalyan

ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ లపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్ గెలవడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. చిల్లర రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దేశంలోనే నెంబర్ వన్ అంటూ తూర్పారబట్టారు.



తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్ లో ప్రచారం చేపట్టిన చంద్రబాబు... రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లో తానే కాంగ్రెస్‌ను గెలిపించానని చెప్పుకోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. తెలంగాణలో చంద్రబాబు ప్రచారం వల్ల టీఆర్‌ఎస్‌ కు ఇంకో నాలుగు సీట్లు అదనంగానే వచ్చాయని తలసాని కామెంట్ చేశారు. తెలంగాణలో ప్రచారం వల్ల చంద్రబాబు టీఆర్ఎస్‌కు మేలు చేశాడని తలసాని ఎద్దేవా చేశారు.



తెలంగాణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ చేరికలను ఏపీ సీఎం చంద్రబాబు తప్పుబట్టారు. ఈ అంశంపైనా తలసాని శ్రీనివాసయాదవ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో 23 మందిని టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబుకు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు లేనేలేదని తేల్చిచెప్పారు.


తెలంగాణ ఎన్నికల చివరి అంకంలో ఓటర్లు ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారంటూ లగడపాటి రాజగోపాల్‌ పైనా తలసాని విరుచుకుపడ్డారు. సర్వేలను అమ్ముకున్న లగడపాటి రాజగోపాల్ ఓ 420 అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి ఇక సర్వేల సన్యాసం కూడా తీసుకోవాలని తలసాని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: