ఎడిటోరియల్ : తాత్కాలికమే చంద్రబాబుకు అచ్చొచ్చిందా ?

Vijaya

ఎవరైనా నిర్మాణాలు చేసేటపుడు శాస్వత నిర్మాణాలు చేయాలని అనుకుంటారు. అందులోను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నపుడు ప్రణాళికాబద్దంగా నిర్మాణాలు చేస్తారు. కానీ చంద్రబాబునాయుడు వ్యవహారం మాత్రం రివర్స్ గేరులో నడుస్తోంది. మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పటినుండి ప్రతీది తాత్కాలికమే అంటున్నారు. చంద్రబాబు వరస చూస్తుంటే బహుశా తాత్కాలికమే అచ్చొచ్చిందేమో అనిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదేళ్ళపాటు హైదరాబాద్ కూడా ఏపికి తాత్కాలిక రాజధానే అన్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

 

 దాదాపు నాలుగున్నరేళ్ళ క్రితం మొదలైన చంద్రబాబు తాత్కాలికం తాజాగా హై కోర్టు భవనాల ఏర్పాటు వరకూ కంటిన్యు అవుతునే ఉంది. 2014లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు హైదరాబాద్ లోని సచివాలయంలో ఏ భవనంలో ఉంటారో తెలీక మూడు భవనాల్లో మరమ్మత్తులు చేశారు. ఎందుకయ్యా అంటే అన్నీ తాత్కాలికమే అన్నారు. మొత్తానికి హెచ్ బ్లాక్ లో చంద్రబాబు ఆఫీసుంటుందని తేలిపోయింది. దానికి మాత్రం పూర్తిస్ధాయిలో రిపేర్లు చేశారు.

 

 అన్నీ అయిపోయిన తర్వాత హెచ్ బ్లాకు వాస్తు ప్రకారం పనిచేయదు కాబట్టి ఎల్ బ్లాక్ అని అందులోకి వెళ్ళారు. వాస్తు చూసి, ముహూర్తాలు చూసి ఎల్ బ్లాక్ లోకి దిగితే ఓటుకునోటు కేసులో తగులుకుని విజయవాడకు పారిపోయారు. హైదరాబాద్ లో ఉన్నపుడే విజయవాడలో అసెంబ్లీ, సచివాలయం కట్టారు. అవికూడా తాత్కాలికమే. రూ 200 కోట్లతో మొదలుపెట్టిన నాసిరకం తాత్కాలిక నిర్మాణాల ఖర్చు మొత్తానికి రూ 1000 కోట్లకు చేరుకుంది.

 

 తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటు కోసం విజయవాడలోనే ఇరిగేషన్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత దాన్నీ మార్చేశారు. అంటే అప్పటి వరకూ చేసిన కోట్ల రూపాయలు వృధా. ఇక, పట్టిసీమ ప్రాజెక్టును చూస్తే అదీ తాత్కాలికమే. నిజానికి ఈ ప్రాజెక్టు అవసరమే లేదు. కానీ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా ఉంటుందని చెప్పి రూ 500 కోట్లతో పట్టిసీమ కట్టారు.

 

 తాజాగా హై కోర్టు విషయం తీసుకుంటే అదీ తాత్కాలికమే. కేంద్రానికి ఒకమాట చెప్పి సుప్రింకోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి మొత్తానికి న్యాయవ్యవస్ధను కంపు చేసేశారు. హై కోర్టును ఏపికి తరలించాలని తెలిసినా నాలుగున్నరేళ్ళ పాటు ఏమీ పట్టనట్టుండి చివరకు హడావుడిగా నిర్మాణాలు మొదలుపెట్టిన ఘనుడు చంద్రబాబే. జనవరి 1వ తేదీన హైదారాబాద్ నుండి ఏపి హై కోర్టును తరలించాల్సొచ్చినపుడు విజయవాడలో మళ్ళీ తాత్కాలిక భవనాలే దిక్కయ్యాయి. ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబుకు తాత్కాలికాలే అచ్చొచ్చాయేమో అనే అనుమానం వస్తోందరికీ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: