చంద్రబాబు, పవన్ మధ్య కీలక నిర్ణయం ?

Vijaya

అవును ఇపుడీ విషయమే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగుదేశంపార్టీ, జనసేన మధ్య ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే పొత్తుంటుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవాలని చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపును పవన్ కల్యాణ్ తిరస్కరించిన విషయం అందరికీ తెలిసిందే. టిడిపితో పొత్తు పెట్టుకునే విషయంలో ఒకవైపు పవన్ వద్దని మొత్తుకుంటున్నా చంద్రబాబు మాత్రం వదలకుండా పవన్ ను గోకుతునే ఉన్నారు.

 

 ఇదిలా వుంటే తెలుగుదేశంపార్టీలోని విశ్వసనీయవర్గాలు చెప్పిందేమంటే, చంద్రబాబు, పవన్ మధ్య ఎన్నికల తర్వాత పొత్తుంటుందట. ఎన్నికల ముందు గనుక పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీలు నష్టపోయే ప్రమాదముందని ఇద్దరు అగ్ర నేతలకు మధ్యవర్తలు స్పష్టంగా చెప్పారట. ఇటు చంద్రబాబుకు అటు పవన్ కు బాగా సన్నిహితుడైన ఓ ఫైనాన్షియరే పొత్తుల విషయంలో కూడా మధ్యవర్తిత్వం నెరుపుతున్నారట. చంద్రబాబుతో ఎట్టి పరిస్ధితుల్లోను పొత్తు వద్దంటూ కాపు నేతలు పలువురు పవన్ కు స్పష్టం చేశారట. కాపులను బిసిల్లో చేరుస్తాననే హామీ ఇచ్చి తర్వాత తుంగలో తొక్కినందుకు కాపుల్లో చంద్రబాబుపై బాగా వ్యతిరేకత కనిపిస్తోంది.

 

 దాంతో పాటు తునిలో రైలు దహనం కేసులో ఏమాత్రం సంబంధం లేని కాపు నేతలు చాలామందిని విచారణ పేరుతో అదుపులోకి తీసుకోవటం, జైళ్ళల్లో పెట్టటం లాంటి చర్యల వల్ల రాజకీయాలకు సంబంధం లేని కాపులు కూడా చంద్రబాబంటే మండుతున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లు చంద్రబాబుకు పడవనే ప్రచారం జరుగుతోంది. ఇటువంటి పరిస్దితుల్లో పవన్ వెళ్ళి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు మీద కోపం పవన్ పైన కూడా పడే అవకాశం ఉందని కాపు నేతలు చెప్పారట. చంద్రబాబుతో పొత్తు వద్దని పవన్ అనుకోవటం వెనుక ఇది కూడా పెద్ద కారణమే అని సమాచారం.

 

ఈ నేపధ్యంలోనే ఇద్దరికీ కావాల్సిన ఫైనాన్షియర్ రంగంలోకి దిగారట. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకునే కన్నా తర్వాత పొత్తులు పెట్టుకుంటే ఇద్దరికీ మేలు జరుగుతుందని పవన్ కు చెప్పారట. ఎన్నికల్లో రెండు పార్టీలకు వచ్చే సీట్ల ఆధారంగా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయవచ్చని సూచించారట. అందుకు పవన్ కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం. కాబట్టి టిడిపి సోర్సు చెప్పేదాని ప్రకారం చంద్రబాబు ఇఫుడు గోకుడు ఎన్నికల తర్వాత మద్దతు కోసమే అని అనుకోవాలేమో ? చూద్దాం ఏం జరుగుతుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: