సంక్రాంతి పండగొచ్చే..! పల్లెకు పోదాం చలో చలో..!!

Vasishta

సంక్రాంతి అంటే తెలుగు లోగిళ్లు మెరిసి మురిసిపోయే పండుగ. తెలుగు ప్రజలకు అతి పెద్ద పండుగ.. సంవత్సరానికి ఒకసారి సొంతూళ్లలో ఆహ్లాదకరంగా గడిపే క్షణాలివి. సకుటుంబ సపరివార సమేతంగా జరుపుకునే పండుగ. అలాంటి పండుగ కోసం పట్నంవాసులంతా పల్లెకు పోదం చలో చలో.. అంటూ ముస్తాబవుతున్నారు. పుట్టి పెరిగిన పల్లె తల్లిని పలకరించి, పులకరించేందుకు పిల్లా పెద్దా అంతా పయనమై పోతున్నారు.


సంక్రాతి పండుగ ఎఫెక్ట్ పట్టణాలు, నగరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. ఆర్టీసీ  బస్సులు, రైళ్లు ఫుల్ అయిపోయాయి. ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాయి. ప్రత్యేక రైళ్లను కూడా దక్షిణ మధ్య రైల్వే అందుబాటులో ఉంచింది. అయితే వేటిలోనూ సీట్లు లేవు. ఇప్పటికే ఫుల్ అయిపోయాయి. శుక్రవారం నుంచి మొదలయ్యే పండగ సందడి వచ్చే ఆదివారం వరకూ కొనసాగనుంది. శుక్రవారం నుంచి నగరాన్ని విడిచి వెళ్లేందుకు హైదరాబాద్ వాసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో వేలాదిగా బస్సులు, రైళ్లు పల్లెబాట పట్టనున్నాయి.


పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తిరుపతి – విశాఖపట్నం, కాచిగూడ – విశాఖపట్నం, విశాఖపట్నం – తిరుపతి, తిరుపతి – కాచిగూడ, హైదరాబాద్ – విశాఖపట్నం, సికింద్రాబాద్ – దర్భంగా, హైదరాబాద్ – రక్సుల్  మార్గాల్లో ఈ రైళ్లను నడుపుతోంది. అయితే ప్రయాణికులు ఇప్పటికే రిజర్వేషన్లు చేసేసుకున్నారు. ఇప్పటికీ టికెట్లకోసం ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్ల ముందు బారులు తీరుతున్నారు.


మరోవైపు రద్దీని క్యాష్ చేసుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్ ఆపరేటర్లు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేసినా టికెట్లు సరిపోవట్లేదు. దీంతో ప్రైవేటు ఆపరేటర్లు రేట్లు పెంచేశారు. డబుల్, ట్రిపుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఎలాగైనా సొంతూరికి వెళ్లాలనే ఉద్దేశంతో ప్రయాణికులు భారం భరించక తప్పట్లేదు..


మరోవైపు ఊళ్లకు వెళ్లే వాళ్లు ఇంటి భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులకు ముందే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. మరోవైపు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో దోపిడీలు జరిగే అవకాశం ఉన్నందున భద్రంగా వస్తువులను తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఇరుగుపొరుగు ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని ఇప్పటికే సూచనలు జారీ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: