గణతంత్ర దినోత్సవం సంధర్భంగా మనకు తెలియని కొన్ని సత్యాలు!

Edari Rama Krishna
వర్తక వ్యాపారం కోసం వచ్చిన బ్రిటీష్ వారు కొంత కాలం తర్వాత భారత దేశాన్ని పాలించే పాలకులుగా మారిపోయారు.  రెండు వందల సంవత్సరాల పాటు భారత దేశాన్ని తమ అధీనంలో ఉంచుకొని ఇక్కడి సర్వసంపద తమ దేశానికి తరలించారు.  తమ పాలనకు ఎదురు తిరిగిన వారిని అణగదొక్కుతూ..సఖ్యతగా ఉన్న భారతీయుల మద్య వైశమ్యాన్ని తీసుకు వచ్చి విభజించూ పాలించు అనే పద్దతిలో తమ కృరత్వాన్ని చాటుకున్నారు. బ్రిటీష్ పాలకులను తరిమేందుకు శాంతి, అహింసా మార్గంలో బాపూజీ పోరాడగా..తుపాకికి తూపాకీనే సమాధానం అంటూ భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ లాంటి వారు పోరాడారు. 

ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి విముక్తమై భారతదేశం స్వతంత్ర దేశమైంది. బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన 1947 భారత స్వాతంత్రం చట్టం కింద రాజ్యాంగ అధినేత గా 6వ జార్జి ప్రభువు, ఎర్ల్ మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గాను మనకు స్వాతంత్ర్యం సిద్దించింది.  కాకపోతే అప్పటికీ మనకంటూ స్వతంత్ర రాజ్యాంగం లేకపోవడంతో 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగింది. దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు  1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది.  ఈ కమిటీ అధ్యక్షునిగా బాబా సాహెబ్, అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు.   అనేక సవరణల అనంతరము 1949 నవంబరు 26 న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలములో పూర్తిచేశారు.

ప్రపంచములోనే అతి పెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగము లిఖిత రాజ్యాంగము. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచారు. నాటినుండి భారతదేశము " సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా రూపొందింది. భారత స్వాతంత్ర్యం పోరాటానికి నాయకత్వం వహించిన ‘భారత జాతీయ కాంగ్రెస్’ 1930లో ‘పూర్ణ రాజ్య’ కోసం ప్రకటన చేసి ప్రతి సంవత్సరం జనవరి 26ను పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవం జరపాలని జాతికి పిలుపునిచ్చింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశమంతటా వాడవాడలా ప్రజలు జాతీయ పతకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకొంటారు.


- స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం: 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు.
- రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది.
- రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది.
- భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు.
- 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి, భారత్ తాత్కాలిక పార్లమెంటు గా మారింది.
- 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది.
- మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నాయి, హిందీలో ఒక ప్రతి, ఇంగ్లీష్ లో ఒక ప్రతి ఉన్నాయి, ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌కేసులలో పార్లమెంట్ భవనంలో భద్రపరిచారు, వాటి నకలును ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. 
- మన రాజ్యాంగం జనవరి 26వ తేది ఉదయం 10:18 నిమిషాలకు అమలులోకి వచ్చింది.
- 1930వ సంవత్సరంలో జనవరి 26వ తేదిని స్వాతంత్ర్య దినోత్సవం లేదా పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకొనేవారు, అంటే ఆరోజున భారతదేశం పూర్తి స్వేఛ్చ కోసం పోరాడడానికి నిర్ణయించుకున్న రోజు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: