కే ఏ పాల్ బోయింగ్ విమానం నుంచి క్యాబ్ స్థాయికి దిగజారారా..?
కే ఏ పాల్.. ప్రపంచ దేశాల అధ్యక్షులతో పరిచయాలు ఉన్న మత ప్రబోధకుడు. వందల కోట్ల రూపాయలు నిధులు సేకరించి అనాధలను ఆదుకున్నానని చెప్పుకుంటారు. ప్రపంచంలో బోయింట్ 707 విమానం కలిగి ఉన్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరు.
కానీ ఇదంతా ఘనమైన గతమేనా.. ఇప్పుడు ఆయన పీకల్లోతు ఇబ్బందుల్లో ఉన్నారా.. కనీసం సొంత కారు కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారా.. అంటే అవునంటున్నారు కొందరు. అమెరికాలోని బోయింగ్ విమానానికి అనుమతులు పొడిగించలేదు. అది అక్కడే చిక్కుకుపోయిందట.
విదేశీ సంస్థల నుంచి గతంలో ఇబ్బడి ముబ్బడిగా నిధులు వచ్చేవి. కానీ యూపీఏ ప్రభుత్వ హయాంలో తెచ్చిన నిబంధనల కారణంగా ఆ నిధులు ఆగిపోయాయట. ఈ కారణంగా కే ఏ పాల్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారట. ఆయన ఇటీవల హైదరాబాద్ వచ్చి మీడియా ఛానళ్లలో హాడవిడి చేశారు.
కానీ ఆ మీడియా సంస్థల ఆఫీసులకు కే ఏ పాల్ క్యాబులు బుక్ చేసుకుని రావడం మీడియా ప్రతినిధులను ఆశ్చర్యపరిచింది. తన పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి నియోజకవర్గానికి వంద కోట్లు ఇస్తానంటున్న కే ఏపాల్.. అసలు ఆర్థిక పరిస్థితి ఏంటి.. అన్నది మిస్టరీగానే మారింది. తన పేరు మీద ఒక్క లక్ష కూడా లేవని చెప్పుకునే కే ఏ పాల్.. తన ఛారిటీ సంస్థల నిధులతోనే నెట్టుకొస్తున్నారు.