ఎడిటోరియల్ : ఆ ఐదు జిల్లాలే టిడిపి కొంప ముంచుతాయా ?

Vijaya

చూడబోతే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు అలాగే ఉన్నాయి.  చాలా జిల్లాల్లో గ్రూపు తగాదాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ  ఐదు జిల్లాల్లో మాత్రం నేతల మధ్య వివాదాలు తారాస్ధాయికి చేరుకున్నాయి. ఐదు జిల్లాల్లో మూడు జిల్లాలు రాయలసీమలోను రెండు ఉత్తరాంధ్ర జిల్లాలోను ఉన్నాయి. ఎన్నికలు సమీపదూరంలోకి వచ్చేసినా  వివాదాలు పరిష్కారం కాకపోగా మరింత పెరుగుతుండటమే విచిత్రంగా ఉంది. ఐదు జిల్లాల్లో 63 అసెంబ్లీ నియోజకవర్గాలుండటం గమనార్హం. ప్రతీ జిల్లాలోను వివాదాలు అతకంతకు పెరిగిపోతుండటం చంద్రబాబునాయుడు నాయకత్వానికి సవాలుగా నిలిచింది. ఇక ప్రస్తుతానికి వస్తే రాయలసీమలోని మూడు జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నేతల మధ్య విభేదాలు తీవ్రస్ధాయికి చేరుకున్నాయి.

 

కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య వివాదాలు పీక స్టేజ్ కు చేరుకున్నాయి. కడప ఎంపి సీటులో ఫిరాయింపు మంత్రి పోటీ చేసేట్లు, జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి పోటీ చేసేట్లు అంగీకారం కుదిరింది. అయితే, ఒప్పందంపై ఆదినారాయణ ఎంతవరకూ నిలుస్తారో అనుమానమే. ఎందుకంటే, కడప ఎంపి సీటులో టిడిపి గెలుస్తుందని ఎవరిలోను నమ్మకం లేదు.  ఇక జమ్మలమడుగును వదిలిపెడితే కమలాపురం, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, మైదుకూరు నియోజకవర్గాల్లో కూడా వేభేదాలు బాగానే ఉన్నాయి,

 

కర్నూలు జిల్లా నేతల మధ్య విభేదాలపై ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆళ్ళగడ్డ, నంద్యాల, కర్నూలు, కోడుమూరు, శ్రీశైలం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో విభేదాలు తీవ్రస్ధాయిలో ఉన్నాయి. ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియ ఓటమే ధ్యేయంగా మిగిలిన నేతలు ఏకమవ్వటమే విభేదాల తీవ్రతను చెబుతున్నాయి. అఖిల ప్రభావమే నంద్యాలలోని సోదరుడు భూమా బ్రహ్మానండరెడ్డి మీద కూడా పడింది. టిడిపిలో గ్రూపులు చాలవన్నట్లు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీలో చేరితే మొదలయ్యే కంపు అందనం.

 

ఇక, అనంతపురం జిల్లా గురించి కొత్తగా చెప్పాల్సిన పనేలేదు. అనంతపురం, రాయదుర్గం, గుంతకల్, పుట్టపర్తి, హిందుపురం, పెనుగొండ, శింగనమల, కల్యాణదుర్గం, కదిరి నియోజకవర్గాల్లో నేతల మధ్య గొడవలు పీక్స్ కు చేరుకున్నాయి. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టిడిపి 4 చోట్ల గెలిస్తే చాలా గొప్పంటూ స్వయంగా అనంతపురం ఎంపి జేసి దివాకర్ రెడ్డే బాహాటంగా చెబుతున్నారంటేనే పరిస్ధితేంటో అర్ధమైపోతోంది.  

 

అలాగే, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లాలో నేతల మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరుకున్నాయ్. మంత్రులిద్దరు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య పరిస్ధితి ఉప్పు నిప్పు. దాంతో జిల్లాలోని నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. దాంతో  జిల్లాలో మరో బలమైన వర్గం కలిగిన అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ వైసిపిలో చేరారు. దాదాపు అందరి ఎంఎల్ఏల మీదా అవినీతి ఆరోపణలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అదేవిధంగా విజయనగరం జిల్లాలో కూడా పరిస్దితి ఏమీ బావోలేదు. జిల్లాలో ఉన్న గొడవలు చాలవన్నట్లుగా కొత్తగా కాంగ్రెస్ నుండి వైరిచెర్ల కిషోర్ చంద్రదేవ్ ను తీసుకుంటున్నారు. కాబట్టి ఉన్న గొడవలకు వైరిచెర్ల చేరిక బోనస్ అవుతుంది. మరి ఎన్నికల సమయంలో ఏం జరుగుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: