బాబుగారూ..! ఎందుకంత బేజారూ...?

Vasishta

ఏపీ సీఎం చంద్రబాబు ఈ మధ్య కాలంలో మరీ దిగజారిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడుతున్న మాటలు ... చంద్రబాబేనా మాట్లేడేది అన్నట్టు అనుమానించాల్సి వస్తోంది. వయసు పెరిగిపోవడమో, చాదస్తమో.. లేకుంటే ఎన్నికల్లో ఓడిపోతామేమోననే భయమో తెలీదు కానీ ఆయన మాటలు ఈ మధ్య కొంతమందికి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.


చంద్రబాబు ఈ మధ్య ఏ బహిరంగసభలో మాట్లాడినా జగన్ పై విరుచుకుపడుతున్నారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంపై విమర్శలు సహజమే కదా..! అయితే ఆయన మాటలు మరీ శృతి మించుతున్నాయి. జగన్ గెలిస్తే రాష్ట్రం బీహార్ అవుతుంది.. రౌడీల రాజ్యం వస్తుంది.. నీళ్లు రావు.. ఉద్యోగాలు ఉండవు.. లాంటి మాటలు వినేవారెవరికైనా ఆశ్చర్యం కలిగిస్తాయి. జగన్ కేసీఆర్, మోదీతో కుమ్మక్కయ్యారని, వాళ్లు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.


ఏపీకి ప్రతిపక్ష నేతగా ఉంటూ హైదరాబాద్ నుంచే జగన్ వ్యవహారాలు చక్కబెడ్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వం వారికి సహకరిస్తోందనేది చంద్రబాబు ఆరోపణ. వీరిద్దరికీ మోదీ నాయకుడని బాబు విమర్శిస్తున్నారు. ఎక్కడి నుంచి తన పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలనేది ఆయన ఇష్టం. ఇన్నాళ్లూ అమరావతిలో ఇల్లు లేదు కాబట్టి హైదరాబాద్ నుంచే పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో అనుమానించాల్సిందేముంది? హైదరాబాద్ నుంచి పార్టీని నడిపిస్తుంటే ఆయనకు కేసీఆర్ సహకరిస్తున్నారని ఎలా అనుకుంటారు? ఒకవేళ జగన్, కేసీఆర్ కలిస్తే ఏపీకి నీళ్లు ఎందుకు రావు..? నిజంగా వాళ్లిద్దరూ రేపు అధికారంలో ఉంటే సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకుంటారేమో..? అప్పుడు ఇప్పటిలాగా ఉద్రిక్త వాతావరణం రెండు రాష్ట్రాల మధ్య ఉండదు కదా..? పొరుగుదేశంతో స్నేహం కోరుకోవాలికానీ శతృత్వం కాదు కదా..!


          జగన్ గెలిస్తే రౌడీయిజం పెరిగిపోతుందని, నీళ్లు రాకుండా పోతాయని, రాజధానిని తరలించేస్తారని ప్రచారం చేయడం చంద్రబాబు చాదస్తానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ దశలో రాజధానిని తరలించే సాహసం అధికారంలోకి వచ్చే ఏ పార్టీ కూడా చేయదు. అంతేకాదు రాజధానిని తరలించే ప్రసక్తే లేదని మేనిఫెస్టోలో కూడా పెడ్తామని వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. జగన్ పైనున్న కేసులను పదే పదే గుర్తు చేస్తూ ఆయన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు.. కానీ చంద్రబాబు ఆరోపణలేవీ కొత్తవి కాదు.. ఇవన్నీ 2014కు ముందు నుంచి జగన్ పై ఉన్నవే..! కేసీఆర్, మోదీలతో కలవడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు జగన్ గండి కొడ్తున్నారనే చంద్రబాబు మాటలను ప్రజలు ఎంతవరకూ నమ్ముతారో చూద్దాం.. ఒక్కటి మాత్రం నిజం.. బాబు మాత్రం తెగ బేజార్ అయిపోతున్నారు ఈ మధ్య..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: