బాబ్రీ – అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

Vasishta

సుదీర్ఘ కాలంగా పెండిగ్ లో ఉన్న అయోధ్య అంశానికి శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా సుప్రీంకోర్టు అడుగులు వేస్తోంది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యలు పరిష్కారం కనుగొనాలని నిర్ణయించింది. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియను 8 వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.


అయోధ్య అంశానికి సంబంధించిన మధ్యవర్తిత్వ బృందంలో జస్టిస్ ఇబ్రహీం ఖలీఫుల్లా (రిటైర్డ్), శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ అడ్వొకేట్ శ్రీరాం పాంచూ ఉన్నారు. జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలో ఈ టీం పనిచేస్తుంది. మరికొంతమంది సభ్యులను కూడా ఇందులో చేర్చే అవకాశముంది. ఫైజాబాద్ కేంద్రంగా ఈ కమిటీ పనిచేయనుంది. అయితే కమిటీ అధ్యయనానికి సంబంధించిన విషయాలేవీ మీడియాకు వెల్లడించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


అయోధ్య – బాబ్రీ మసీదు అంశానికి సంబంధించి మధ్యవర్తిత్వ పరిష్కారమార్గంపై  తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వ్ చేసింది. ఇది కేవలం భూవివాద పరిష్కారం కాదన్న సుప్రీంకోర్టు.. భావోద్వేగాలతో కూడిన అంశమని స్పష్టం చేసింది. అందుకే ఒకరిదిద్దరితో కాకుండా పలువురు మధ్యవర్తుల ద్వారా ఈ వివాదానికి పరిష్కారాన్ని కనుక్కొనేందుకు కృషి చేయనున్నట్టు తెలిపింది.


అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, రామ్ లల్లా, నిర్మోహి అఖాడా సమానంగా పంచుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు 8 ఏళ్ల కిందట తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చివరకు మధ్యవర్తిత్వానికి అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని హిందూ సంస్థలు వ్యతిరేకించాయి. ముస్లిం సంస్థలు మాత్రం స్వాగతించాయి. దీంతో తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ లో ఉంచింది. ఇవాళ మధ్యవర్తిత్వానికే మొగ్గు చూపుతూ ఆదేశాలు జారీ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: