ఎడిటోరియల్ : పవన్ ను గెలిపించే బాధ్యత కూడా చంద్రబాబు మీదేనా ?

Vijaya

క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను గమనిస్తే అలాగే ఉంది వ్యవహారం. జనసేనకు సొంతంగా ఓటు బ్యాంకు ఇంతుంది అని చెప్పుకునేందుకు లేదు. అందుకనే రాబోయే ఎన్నికల్లో పవన్ ఎక్కడ పోటీ చేసినా టిడిపినే గెలిపించాల్సొచ్చేట్లుంది. ఎందుకంటే, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ బంధం బయటపడిపోయింది కాబట్టి. మొదటిసారి పోటీ చేస్తోంది కాబట్టి  పవన్ నమ్ముకున్నదంతా ఎంతమంది ఓటుహక్కు ఉందో లేదో కూడా తెలీని అభిమానులు, కాపు సామాజికవర్గం ఓట్లే.

 

పేపర్ బ్యాలెట్ కాలంలో అయితే బూత్ లను గుప్పిట్లో పెట్టుకుని దొంగఓట్లు వేయించుకునే అవకాశాలుండేవి. ఈవిఎంలు వాడుకలోకి వచ్చిన తర్వాత దొంగఓట్లకు అవకాశం తక్కువనే చెప్పాలి. అందుకనే పవన్ ప్రధానంగా కాపుల ఓట్లు ఎక్కడ ఎక్కువగా ఉందో చూసుకుంటున్నారు. అలాగే టిడిపికి సేఫ్ నియోజకవర్గం ఏదో కూడా వెతుక్కుంటున్నారు.

 

ఆ వెతుకులాటల్లో భాగంగానే విశాఖపట్నం జిల్లాలోని బీమిలీ, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాలు కనిపించాయి. అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని తిరుపతి మీద కూడా పవన్ దృష్టి ఉందంటున్నారు. సోమవారం వరకూ విశాఖపట్నం జిల్లాలోని పై మూడు నియోజకవర్గాలను ఖరారు చేయకుండా పవన్ కోసమే అట్టేపెట్టారు చంద్రబాబు. అయితే ఏమైందో ఏమో కానీ పై మూడు నియోజకవర్గాల్లో చివరకు టిడిపి అభ్యర్ధులను ప్రకటించేశారు.

 

అంటే ఇపుడు పవన్ పై మూడు నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసినా టిడిపి తరపున పోటీలో ఉన్నది డమ్మీ అభ్యర్ధులైతే కాదు. పైగా మూడింటిలో రెండు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంఎల్ఏలకే టికెట్లు కేటాయించేశారు. అంటే వాళ్ళు గట్టివాళ్ళనే అనుకోవాలి. అంటే గాజువాకలో పవన్ పోటీ చేసినా గెలుపు అంత ఈజీకాదు. పోనీ  తిరుపతిలో పోటీ చేద్దామంటే అక్కడా టిడిపి అభ్యర్ధి సుగుణమ్మ పోటీ చేస్తున్నారు. పైగా వైసిపి తరపున కరుణాకార్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

 

లాజిక్ ప్రకారం చూస్తే ఎక్కడ కూడా పవన్ గెలుపు అంత ఈజీఏమీ కాదనేది అర్ధమవుతోంది. అందుకే పవన్ గెలుపు బాధ్యత కూడా చంద్రబాబు మీదే ఉంటుంది. కాబట్టి పవన్ ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా టిడిపి అభ్యర్ధి బలపశువు కాక తప్పదనే వాదన వినిపిస్తోంది. ఒకవైపు మంగళగిరిలో పుత్రరత్నం నారా లోకేష్ ను గెలిపించుకునే విషయంలోనే టెన్షన్ పడుతున్నారు. అలాంటిది ఇపుడు పవన్ గెలుపు బాధ్యత అదనం. ఏం చేస్తాం ఫెయిర్ రాజకీయాలు చేయకపోతే సమస్యలు ఇలాగే ఉంటాయి మరి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: