ఎడిటోరియల్ : దిక్కులేకే మళ్ళీ వైసిపిలోకి వస్తున్నారా ?

Vijaya

ఇపుడిదే ప్రశ్న వైఎస్ అభిమానులను వేధిస్తోంది. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 22 మంది ఎంల్ఏలు, ముగ్గురు ఎంపిలు జగన్ ను కాదనుకుని తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించారు. అక్కడున్నంత కాలం అన్నీ అధికారాలను అనుభవించారు. ఫిరాయించినందుకు చంద్రబాబు దగ్గర ఎవరికి తగ్గట్లుగా వారు భారీ తాయిలాలనే అందుకున్నారు. తీరా ఎన్నికల ప్రక్రియ ఊపందుకునే సమయానికి తమ తప్పు తెలుసుకున్నామంటూ మళ్ళీ వైసిపిలోకి వస్తున్నారు.

 

ఇక్కడే చాలామందికి ఫిరాయింపులపై మండిపోతోంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకుని టిడిపిలోకి ఫిరాయించి తీరా అక్కడ టికెట్ దక్కకపోయేటప్పటికి మళ్ళీ జగనే గుర్తుకు వస్తున్నాడు. వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించిన వాళ్ళల్లో గెలుస్తారని అనుకున్న వాళ్ళల్లో  కొందరికి చంద్రబాబు టికెట్లిచ్చాడు. మిగిలిన వాళ్ళని చెత్తబుట్టను మూలన పెట్టేసినట్లు పెట్టేశాడు.

 

ఎప్పుడైతే తమకు టికెట్లు దక్కలేదో తమను చంద్రబాబు మోసం చేశాడని ఆక్రోశిస్తున్నారు. చంద్రబాబుపై ఆరోపణలు చేసే నైతికత ఫిరాయింపులకు లేదు. చంద్రబాబు అవసరం కోసం వీళ్ళని ప్రలోభాలకు గురిచేశాడు. ఎంఎల్ఏలు, ఎంపిలు కూడా వాళ్ళ అవసరాల కోసం ప్రలోభాలకు లొంగిపోయారన్నది వాస్తవం. కాబట్టి ఫిరాయింపులకు చంద్రబాబు టికెట్లు ఇవ్వకపోయినా అడితే నైతికహక్కు లేదు.

 

ఫిరాయింపుల్లో ముందుగా కర్నూలు ఎంపి బుట్టా రేణుక టిడిపిలో నుండి మళ్ళీ వైసిపిలో చేరారు. తాజాగా కర్నూలు ఫిరాయింపు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డి కూడా తిరిగి  వైసిపిలో చేర్చుకోమంటూ జగన్ కాళ్ళా వేళ్ళా పడుతున్నారు. టికెట్లు రాని మరికొందరు ఫిరాయింపులు సైలెంట్ గా ఉండిపోయారు. బద్వేలు ఫిరాయింపు ఎంఎల్ఏ జయరామ్ బిజెపిలో చేరారు.

 

టికెట్లు రాని కొందరు తాము పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నామంటున్నారు. తాము చేసిన తప్పు తెలుసుకున్నామని లెంపలేసుకుంటున్నారు. తమ తప్పు తెలుసుకున్నాం కాబట్టి తమను తిరిగి వైసిపిలో చేర్చుకోవాలంటున్నారు. వీళ్ళకి చంద్రబాబు గనుక టికెట్లిచ్చుంటే వైసిపిలో చేరేవారేనా ? చంద్రబాబు టికెట్లివ్వలేదు కాబట్టి, రేపటి ఎన్నికల్లో వైసిపినే అధికారంలోకి వస్తుందనే ప్రచారం జరుగుతోంది కాబట్టి భవిష్యత్తుపై ఆశతోనే మళ్ళీ వైసిపిలోకి వస్తున్నారు. అంటే ఫిరాయించటమూ స్వార్ధంతోనే తిరిగి వైసిపిలో చేరటమూ స్వార్ధంతోనే అని అర్ధమైపోతోంది. మరి ఇటువంటి వాళ్ళని జగన్ తిరిగి చేర్చుకోవాలా ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: