కీలక నేతలు లేకుండానే ఎన్నికలు జరగొచ్చు..జగన్ వ్యాఖ్యల మర్మమేంటీ?

Vasishta

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందులలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు తనతో పాటు కీలక నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, ఎన్నికలను కార్యకర్తలే ముందుండి నడిపించాల్సిన పరిస్థితులు రావచ్చని చెప్పారు. ఇవి పార్టీ శ్రేణులకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.


పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను అరెస్ట్ అయిన సందర్భాలను జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాడు కాంగ్రెస్ – చంద్రబాబు కలిసి కుట్ర చేసి కేసులు పెట్టాయని చెప్పారు. నాడు అరెస్ట్ అయినప్పుడు మీరంతా అండగా నిలిచారని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి సందర్భమే రావచ్చన్నారు.


రాబోయే రోజుల్లో తమ పార్టీకి చెందిన కీలక నేతలందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న జగన్.. నేతలు లేకుండా కార్యకర్తలే ముందుండి ఎన్నికలు నడిపే పరిస్థితులు రావచ్చని జగన్ అన్నారు. ఈ గడ్డపై ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నానన్న జగన్.. బాధల్లోనూ, సంతోషాల్లోనూ ఇక్కడి ప్రజలు తనకు, తన కుటుంబానికి అండగా నిలిచారన్నారు. ఇప్పుడు కూడా నామినేషన్ తర్వాత మళ్లీ ప్రచారంకోసం పులివెందులకు రాలేకపోవచ్చన్నారు. ఇలాంటి సమయాల్లో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అండగా నిలవాలని వేడుకున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా తమపైన, తన పార్టీ లీడర్లపైన విపరీతమైన కుట్రలు జరుగుతున్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు జరిగే ఈ కుట్రలను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బాబాయి వివేకా హత్యను వాళ్లే చేసి ఇంట్లో వాళ్లపైనే నెపం నెట్టే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటన్నింటినీ తిప్పికొట్టి వైసీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తల అందరిపైనా ఉందన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: