మంత్రి గంటా శ్రీనివాసరావు. ఈ పేరు చెప్పగానే రాజకీయాల్లో సరికొత్త చర్చ తెరమీదికి వస్తుంది. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసినా.. విశాఖలో గెలుపు గుర్రం ఎక్కారనే అందరూ అంటున్నారు. ఇదే ఆయనకు రాజకీయంగా ప్రముఖంగా నిలి చింది. గతంలో అనకాపల్లి ఎంపీగా, చోడవరం నుంచి ఎమ్మెల్యేగా, అనకాపల్లి, భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఆయన ఒక నియోజకవర్గం తో సరిపెట్టకుండా ఎక్కడ నుంచైనా పోటీ చేసి, విజయం సాధించగల నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక, ఇప్పుడు ఇటీవల ముగిసిన ఎన్నికల్లో గంటా సరికొత్త ప్రయోగం చేశారు. టీడీపీకి అంతగా పట్టులేని విశాఖ నార్త్ నుంచి ఆయన పోటీకి దిగా రు. రాజకీయ సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు గంటాకు ఈ టికెట్‌ను కేటాయించారు.
తాను ఎక్కడ నుంచి పోటీ చేసినప్పటికీ గెలిచి తీరుతాననే నమ్మకంతో ఉన్న గంటా వెనుకా ముందు చూసుకోకుండానే నార్త్‌కు ఓకే చెప్పారు. అలాగే భీమిలిలో తన పాత సహచరుడు అవంతి శ్రీనివాస్ వైసీపీ నుంచి పోటీలో ఉండడంతో పాటు గంటాపై సవాళ్లు రువ్వడంతో గంటా సేఫ్‌గా నార్త్‌కు వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. ఏదేమైనా తన ఆనవాయితీ కంటిన్యూ చేస్తూ మరోసారి గంటా నియోజకవర్గం మారారు. నార్త్‌లో పోలింగ్ ముగిశాక...సరళిని బట్టి చూస్తే నాలుగు పార్టీలు ఎంతో కొంత ఓట్లు చీల్చుకున్నట్టే కనపడుతోంది. మరి నాలుగు స్తంభాలాటలో గంటా గెలుపు అంత సులువుగా కనపడడం లేదు. టీడీపీ నుంచి గంటా, వైసీపీ నుంచి కెకే రాజు(కమ్మిలి కన్నపరాజు) జనసేన నుంచి పసుపులేటి ఉషారాణి, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు పోటీ చేస్తున్నారు. వీరిలో కేకేరాజు సహా విష్ణుకు మార్ రాజులకు నియోజక వర్గంపై పట్టుంది. ముఖ్యంగా బీజేపీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ.. విష్ణుపై మాత్రం స్థానికంగా ఎలాంటి వ్యతిరేకత లేకపోవడం ఆయనకు కలిసి వస్తున్న ప్రధాన విషయం. అదేసమయంలో వైసీపీ సానుభూతి పవనాలు కూడా బాగానే వీస్తున్నాయి.
ఇక , జనసేన నుంచి బరిలోకి దిగిన ఉషారాణికి కూడా పవన్ అభిమానులు భారీ ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. అదేసమయంలో పవన్ ప్రచారం కూడా బాగానే కలిసి వచ్చింది. ఈ నియెజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు 50 వేల వరకు ఉన్నాయి. వీటిలో మెజార్టీ ఓట్లు జనసేనకు పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంటాకు ఇక్కడ ఏకపక్ష విజయం సాధ్యమవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించే గంటా ఈ దఫా భారీగానే ఖర్చు చేశారని అంటున్నారు. ఆయన కుటుంబం మొత్తం ఇక్కడ ప్రచారంలో పాలుపంచుకుంది. అయినా కూడా విష్ణుకుమార్ రాజుకు వచ్చిన సింపతీని తగ్గించడంలో మాత్రం వెనుకంజలో నే ఉన్నారని అంటున్నారు. మరి మొత్తానికి ఇక్కడ పరిణామాలు ఎలా ఉంటాయో.. మంత్రి గంటా విజయం సాధిస్తారో లేదో చూడాలి. ఏదేమైనా గతంలో ఉన్న భరోసా మాత్రం ఇప్పుడు గంటాలో కనిపించకపోవడం గమనార్హం.