వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి పీఠం కైవసం చేసుకోవాలని కలగంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఊహించని షాక్ వంటి పరిణామం ఇది. తిరిగి గాంధీల కుటుంబానికి అధికారం చేరువ కావాలని తపిస్తున్న రాహుల్‌కు ఆయన కుటుంబ సభ్యుడి నుంచి ఊహించని జోస్యం వినిపించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన సోదరుడు వరుణ్ గాంధీ. మరో ఇరవై సంవత్సరాలైన రాహుల్ ప్రధాని కాలేరని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ లోక్‌సభ నుంచి వరుణ్ గాంధీ బీజేపీ తరపున పోటీలో ఉన్నారు. సాధారణంగా రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలపై ఎన్నడూ విమర్శలు చేయని వరుణ్ గాంధీ.. మొట్టమొదటి సారి రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా రాహుల్ ప్రధాని కాలేరన్నారు. తానేమి సిద్ధాంతిని కాదని, కాని రాహుల్‌కు ప్రధాని అయ్యే అర్హత ఏమాత్రం లేదని అన్నారు. ప్రధాని మోదీకి ప్రజలు ఓట్లు మాత్రమే కాదని.. అవసరమైతే వారి రక్తం కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని వరుణ్ గాంధీ అన్నారు. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ శిబిరంలో ప్రధాని మోదీకి సరితూగే నాయకుడే లేరని వరుణ్ గాంధీ వ్యాఖ్యానించారు.