జగన్ బెయిల్ చిచ్చు పెట్టిందా...
జగన్ బెయిల్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిందా... లేక సీమాంధ్ర కాంగ్రెస్ ను ఏకంగా ఖాలీ చేయిస్తోందా... అన్న వాదనలు రాజకీయవర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. జగన్ బెయిల్ కు ముందే సీమాంద్ర ఎంపీలు ఎనిమిది మంది రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి వారిని వారించడంతో ఆలోచించాలి అన్న నిర్ణయానికి వచ్చారు. అంతలోనే జగన్ కు బెయిల్ రావడంతో వారిలో ఈ నిర్ణయం మరింత బలీయంగా మారింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
తెలంగాణలో టిఆర్ఎస్ తో, సీమాంధ్రలో జగన్ తో కేంద్రంలో అధికారం కోసం కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పందం కుదుర్చుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. బెయిల్ వచ్చిన తీరుకూడా ఆ ఆరోపణలకు కాస్తా బలం చేకూర్చే విదంగా ఉండడంతో సీమాంద్ర కాంగ్రెస్ లో వణుకు మొదలయింది. ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తున్నాకూడా అధిష్టానానికి తలవంచి రాజీనామాలు చేయకుండా ఉండి పార్టీని కాపాడుతుంటే ఇప్పుడు మా అందరిని పక్కనబెట్టి జగన్ తో కలిసి పోతే మా పరిస్థితి ఏంటి అని వారిలో గుబులు మొదలయిందంటున్నారు.
ప్రధానంగా విజయవాడ ఎంపీ లగడపాటితో పాటు మరో ఎంపి అనంత వెంకటరామిరెడ్డి ఇదే మాటలు చెప్పి సిఎం ఇచ్చిన విందుకు కూడా హాజరు కాలేదని సమాచారం. వారి రాజీనామాలు ఆపడానికి సిఎం, పిసిసి చీఫ్ బొత్స చేస్తున్న ప్రయత్నాలకు జగన్ బెయిల్ పెద్ద అవరోదంగా మారిందన్న వార్తలు కూడా కాంగ్రెస్ వర్గాలనుంచి వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు జగన్ ను తిట్టిపోస్తూ తిరిగిన మాకు ఇక భవిష్యత్తు ఏది అంటున్న వారు కొందరు కాగా మరి కొందరు ఇప్పటికే జగన్ పార్టీతో సంబందాలు పెట్టుకుని ఆయన పార్టీలోకి వెల్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారట, అయితే ఆ అవకాశం లేని వారిలో మాత్రం వణుకు మొదలయింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.