జగన్ కు అగ్ని పరీక్ష
జగన్ కు బెయిల్ రావడం రాష్ట్రం అంతటా ఆయన అభిమానుల్లో సంబరాలు నింపితే జగన్ కు మాత్రం అది అగ్నిపరీక్షగా మారిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. కారణం ఆయన జైలు నుంచి బయటకు వస్తే చూసి తరించేందుకు రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి అభిమానులు తరలి వచ్చారు. రాని వారు వారి ప్రాంతాల్లో సంబరాలు జరుపుకున్నారు. ఇదంతా మంగళవారం ఉదయం నుంచి టీవీల్లో అందరం చూసాం కూడా.
దీనిని చూసి జగన్ కు సంబరపడాలా, లేక ఆయన ఏనిర్ణయం తీసుకోవాలో తెలియని చిక్కు సమస్యను ఆయన అభిమానులు తెచ్చిపెట్టారు అని గాభరా పడాలా అన్నది తేల్చుకో లేని పరిస్థితి. కారణం ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు. కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయంతో రాష్ట్రం రెండు ప్రాంతాలు విడిపోయి విద్వేషాలతో అట్టుడికి పోతోంది. ఓ ప్రాంతంవైపు మొగ్గు చూపితే మరో ప్రాంతంలో శతృవులా చూస్తున్న పరిస్థితి.
అయితే ముందునుంచి విజయమ్మ, జగన్ చెపుతున్న మాటల ప్రకారం వైఎస్సార్ తెలుగువారందరి మనిషి అని, అన్ని ప్రాంతాల శ్రేయస్సే మా కర్తవ్యమని అంటున్నారు. విభజన నిర్ణయంతో జగన్ పార్టీ తీసుకున్న టర్న్ తో నాయకుల్లో విబేదాలు వచ్చి తెలంగాణలో పార్టీకి గుడ్ బై చెప్పారు కాని జనాల్లో మాత్రం జగన్ పై అభిమానం పోలేదని ఇంకా ఆయనను తెలంగాణలో దేవునిలా చూస్తున్నారని ఆయన బెయిల్ పై బయటకు వచ్చే ఘట్టం రుజువు చేసింది.
దీంతో రేపటి నుంచి జగన్ ఏంచేయాలి, సమైక్య రాష్ట్రంగా ఉండాలి అని ఇప్పుడు అంటున్నారు, కాని వన్ సైడ్ అయి తెలంగాణ విడిపోతే సీమాంధ్రకు నష్టమని డైరెక్టుగా షర్మిలతో పాటు విజయమ్మ కూడా బహిరంగ సభల్లో చెపుతున్నారు. అంతే కాదు సమన్యాయం అంటే కూడా సీమాంద్రలో జనం ఒప్పుకోవడం లేదు. అలాంటప్పుడు ఇప్పుడు జగన్ ఏంచేయాలి, వన్ సైడ్ అయి మాట్లాడితే తెలంగాణలో కూడా ఆయనను గుండెల్లో నింపుకున్న వారు నిప్పులు కురిపిస్తారు, అలా కాక అందరు నావారే అందరికి న్యాయం కావాలి అంటే అసలుకే ఎసరు వస్తుంది, అందుకే ఇప్పుడు జగన్ కు అసలు అగ్ని పరీక్ష ఎదురవుతోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.