హైదరాబాద్: ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ప్రజా విజయమని వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కూతురు షర్మిల అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం తల్లీకూతుర్లు జగన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కై అధికార, డబ్బు బలంతో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని చూశారన్నారు. కానీ, ప్రజలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కుట్రలను, కుతంత్రాలను తిప్పికొట్టారన్నారు. దీనికి నిదర్శనమే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన ఫలితాలని వారన్నారు. ఎఫ్ఐఆర్ లో వైఎస్ఆర్ పేరును చేర్చడం, జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టడాన్ని ప్రజలు జీర్ణించుకోవడం లేదన్నారు. ప్రజలు జగన్ ను నిర్దోషి అని తేల్చారన్నారు. ఈ గెలుపంతా జగన్‌దేనని అన్నారు. జగన్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారనీ, త్వరలోనే రాష్ర్టంలో రాజన్న స్వర్ణయుగం వస్తుందన్నారు. ప్రజలు తమ పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని తామెన్నడూ వమ్ముచేయబోమన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ జగన్ క్రుతజతలు తెలుపాల్సిందిగా చెప్పమని చెప్పారన్నారు. ఓడిపోయిన తమ అభ్యర్థులు ఎప్పుడూ తమవారేననీ, వారికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. పైనుంచి దేవుడు చూస్తున్నాడనీ, త్వరలోనే జగన్ బయటకు వస్తాడనీ, ఓదార్పుయాత్రను కొనసాగిస్తాడని విజయమ్మ, షర్మిల చెప్పారు.
మరింత సమాచారం తెలుసుకోండి: