ఆనంద్‌ ట్వీట్‌ "కొన్ని విషయాలను పవిత్రంగానే ఉంచాలి లేకుంటే తాలిబన్లుగా మారతాం"

సామాజిక సృహతో పాటు సమాజం దాని అభివృద్ధి పై అవగాహన ఉండి స్పందించే హృదయమున్న వాళ్లలో ప్రసిద్ధ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్‌ ఆనంద్‌  మహింద్ర ముందువరసలో ఉంటారు.  సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందించే మహీంద్రా తాజాగా ప్రముఖ నటుడు కమల్ హాసన్‌ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. కొన్ని విషయాలను పవిత్రంగానే ఉంచాలని, వాటిని బహిరంగ చర్చకు తీసుకురాకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంఘటన లతో మన జాతి విలువల్ని మనమే పతనం చేసుకొని మనమూ తాలిబన్లుగా మారే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. 

"75 ఏళ్లుగా భారత్ మహాత్ముడి జన్మభూమిగా ఉంది. 'ప్రపంచం నైతికతను కొల్పోయినప్పుడు మన దేశమే ముందుండి దారి చూపింది. ప్రపంచం మనల్ని పేదవారి గా చూస్తుంటే .....బాపు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచి మనల్ని ఐశ్వర్యవంతుల్ని చేశారు. కొన్ని విషయాలు పవిత్రం గానే ఉండాలి. లేదంటే తాలిబన్లుగా మారి మనకోసం మనమే ఏర్పాటు చేసుకున్న విలువల్ని నాశనం చేసుకుంటాం! "  అని ట్వీట్‌ చేశారు. పరోక్షంగా భారత్‌ కు మాత్రమే సొంతమైన విలువల్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.

జాతిపిత మహాత్మా గాంధీ గురించి గత కొన్ని రోజులుగా చాలా చర్చ నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యలు. వాటిపై బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ స్పంధన. వీరు చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చూస్తే తొలి "టెర్రరిస్ట్ నాథురామ్‌ గాడ్సే" అని కమల్ హాసన్ అంటే, లేదు "నాథురామ్ గాడ్సే దేశభక్తుడు" అంటూ సాధ్వి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.   

ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఆనంద్‌ ట్వీట్‌ పై స్పందిస్తున్న అనేక మంది ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా విస్తృతచర్చ జరుగుతోన్న నేపథ్యంలో సమాజానికి సరైన సందేశం ఇచ్చారని పలువురు అభిప్రాయ పడ్డారు. 


ఈ నెల 12 న అరవకురిచి లో "మక్కల్‌ నీది మయ్యం" అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ, దేశంలో తొలి తీవ్రవాది ఒక హిందువు అని.. ఆయనే గాంధీని చంపిన నాథూరామ్‌ గాడ్సే అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అనేక మంది ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: