తెలంగాణా రాజకీయాల్లో కలవరం రేపిన ఎక్జిట్-పోల్ పలితాలు

ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు తెలంగాణాలో కాంగ్రెస్, బీజేపీ లకు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. తాము ఆశించిన దానికి, ఎగ్జిట్‌-పోల్‌ ఫలితాలకు ఎక్కడా పొంతన లేకపోవటం, టీఆర్‌ఎస్‌ కు లోక్‌సభ ఎన్నికలలోనూ ఎదురులేదని తేలడంతో ఆ రెండు పార్టీల నేతలకు గుబులు పట్టుకుంది. కనీసం ఐదు స్థానాలలోనైనా విజయం సాధిస్తామని కాంగ్రెస్, మూడు స్థానాలలోనైనా  విజయం సధిస్తామని బిజేపి కొండంత ఆశలు పెట్టుకున్నాయి. ఎగ్జిట్‌ పోల్ ఫలితాలు ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌కు 14–16 స్థానాల ను రానున్నట్లు అంచనాలు రావటంతో వారి శిబిరాల్లో కలవరపాటు మొదలైంది. 



అటు శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్‌ఎస్, ఇటు లోక్‌సభ ల్లోనూ అదే జోరు కొనసాగిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌-పోల్‌ సర్వేలు తేల్చడం తో తమ భవిష్యత్తు ఏంటనే దానిపై ఆ రెండు పార్టీల నేతలు కలవరపడుతున్నారు. తాము ఆశించిన మేర ఫలితాలు రావన్న అంచనాల నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ నేతలు “రెండో స్థానం”  కోసం గణాంకాలు శోధిస్తున్నారు.


నల్లగొండ, భువనగిరి, చేవెళ్ల, ఖమ్మం, మల్కాజ్‌గిరి స్థానాల్లో తమ కీలక నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రేణుకా చౌదరి, రేవంత్‌ రెడ్డి  బరిలోదిగడంతో వ్యక్తిగత ప్రతిష్టకు తోడు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కూడా తోడవుతుందని విజయం సాధిస్తామని కాంగ్రెస్‌ నేతలు ఆశలు పెట్టు కున్నారు. 




బీజేపీ విషయానికి వస్తే సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌  స్థానాల్లో కిషన్‌ రెడ్డి. డీకే అరుణ. బండి సంజయ్‌ లు అధికార టీఆర్‌ఎస్‌ కు గట్టిపోటీగా బరిలోకి దిగటం, పోలింగ్‌ సరళిని కూడా అంచనా వేసి విజయం సాధిస్తారని అనుకున్నారు.  


కాంగ్రెస్, బీజేపీలకు ఒక్కో స్థానానికి మించి రావడం లేదని, కొన్ని చోట్ల గట్టిపోటీ ఇచ్చిందని ఎగ్జిట్‌-పోల్ అంచనాలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో తాము ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలున్నాయనే దానిపై ఆ రెండు పార్టీల కీలక నేతలు మళ్లీ గణాంకాలతో కుస్తీ పడుతున్నారు.  ఎగ్జిట్‌ పోల్ ఫలితాలు ఒకటి, రెండు స్థానాలకే పరిమితం చేయడంతో నల్లగొండ లో ఖచ్చితంగా గెలుస్తామని, భువనగిరి, మల్కాజ్‌గిరి, ఖమ్మం, మహబూబాబాద్, చేవెళ్లలో రెండింట గెలుస్తామని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. బీజేపీ మాత్రం కరీంనగర్‌ తమదేనని, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్‌ లలో కనీసం ఒకటి గెలుస్తామని ఆశిస్తోంది. ఇందుకోసం పోలింగ్‌స్టేషన్లు, మండలాలు, నియోజకవర్గాల వారీగా తమ కున్న సానుకూలతలు, పోలింగ్‌ జరిగిన తీరును విశ్లేషిస్తూ రెండు పార్టీల నేతలు లెక్కల్లో మునిగిపోయారు.  
 

పోలింగ్‌ సరళిని బట్టి ఐదారు చోట్ల టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చి రెండోస్థానంలో నిలబడతామని, భవిష్యత్తులో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షం కోసం పోటీపడతామ ని ఆశించిన బీజేపి ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఉంటుందా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక స్థానంలోనైనా గెలిచి ఐదారు చోట్ల రెండోస్థానంలో నిలిస్తే కూడా గౌరవం దక్కుతుందని అనుకుంటున్నారు. ఎలాగూ కేంద్రంలో అధికారం దక్కుతుంది కనుక జాతీయ పార్టీ హోదాలో ప్రతిపక్ష రేసులో నిలవచ్చన్నది ఆ పార్టీనేతల అంచనా. బీజేపీకి కాంగ్రెస్‌ లు కూడా తాము గెలిచే స్థానాలేంటి? ఎన్ని చోట్ల రెండో స్థానంలో నిలుస్తామన్న దానిపై లెక్కలు వేసుకుంటోంది. 


కేంద్రంలో అధికారం దక్కకపోగా, ఇక్కడ కూడా ప్రతికూల ఫలితాలు వచ్చి బీజేపీ కన్నా పేలవ స్థాయిలో నిలిస్తే కాంగ్రెస్‌ శాసన సభాపక్షాన్ని టీఅర్ ఎస్ శాసనసభా పక్షంతో విలీనం చేసే ప్రక్రియవేగవంతమవుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. వరుస దేబ్బలతో రాజకీయంగా మనుగడ సాగించలేని స్థితికి చేరుకుంటామనే ఆందోళన కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. మొత్తం మీద ఎగ్జిట్‌-పోల్‌ ఫలితాలు రాష్ట్రం లోని రెండు జాతీయపార్టీల నేతలకు మింగుడుపడటం లేదు. మరోవైపు రెండో స్థానమైనా దక్కలని ఎవరికి వారు కోరుకుంటున్నారు. 


ఉభయ జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల నేతల మనోస్థైర్యం విషయంలో ఒక్క భేధం   మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తుందని, బీజేపీ గతం కన్నా దేశవ్యాప్తంగా లాభపడుతోందన్న ఎగ్జిట్‌ అంచనాలు రాష్ట్ర బీజేపీ నేతల కు, ఆ పార్టీ శ్రేణులకు  ఉపశమనం కలిగిస్తుండగా, మరోసారి అధికారానికి దూరంగా ఉంటామన్న వాస్తవాన్ని కాంగ్రెస్‌ శ్రేణులు జీర్ణించుకోలేకపోతోంది.  అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారం దక్కని పరిస్థితుల్లో, కనీసస్థాయి ప్రాతినిధ్యం కూడా కరువైతే మరో ఐదేళ్లపాటు పార్టీని నడిపించటం శ్రేణులను నిలుపుకోవడం చాలా కష్టమేనని నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: