కోమటిరెడ్డి బ్రదర్స్‌గా పేరొందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాలరెడ్డికి భువనగిరిలో తీపికబురు దక్కిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి నుంచి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ పై స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్నికల కౌంటిగ్ ప్రారంభమైనప్పట్నుంచి ఇద్దరి మధ్య టఫ్ ఫైటింగ్ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తించిన భువనగిరి విజయం చివరకు కోమటిరెడ్డిని వరించింది. ఇవాళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బర్త్ డే కావడంతో ఈ విజయం ఆయనకు పెద్ద గిఫ్ట్ అని కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
మరోవైపు, భువనగిరి ఎంపీ స్థానం కోమటి బ్రదర్స్ కి అచ్చొచ్చింది. 2009లో మిర్యాలగూడ పార్లమెంట్ స్థానంలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా భువనగిరి పార్లమెంట్ స్థానం ఏర్పడింది. తొలి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి భువనగిరి పార్లమెంట్ చరిత్రలో 1.39లక్షల రికార్డు ఓట్ల మెజార్టీతో సీపీఎం అభ్యర్థి నోముల నర్సింహ్మయ్యపై గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‍ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ చేతిలో 30.494ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు.
మళ్లీ అదే స్థానం నుంచి ఆయన సోదరుడు వెంకట్‌రెడ్డి గెలుపొందారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి 1999, 2004, 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల క్యాబినేట్ లో మంత్రిగా పనిచేశారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆయనకు పార్టీ అధిష్ఠానం భువనగిరి ఎంపీ టికెట్ కేటాయించింది. ఇప్పుడు ఇదే భువనగిరి లోక్ సభ స్థానం నుంచి వెంకట్ రెడ్డి పోటీ చేసి 5219ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ పై ఎంపీగా గెలుపొందారు.