తాజా లోక్‌సభ ఫలితాల్లో తెలంగాణలో ఎన్నో సంచలనాలు నమోదు అయ్యాయి. కారు...16... ఢిల్లీలో టీఆర్ఎస్ సర్కారు అంటూ ఎన్నికల్లో ప్రచారాన్ని తెగ ఊదరగొట్టిన కేసీఆర్, కేటీఆర్‌కు తీరా ఫలితాలు చూశాక దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. తెలంగాణలో ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఆ పార్టీకి మహా అయితే ఒక్క సికింద్రాబాద్ సీటు మాత్రమే వస్తుందని అందరూ ఊహించారు. అలాంటిది నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లాంటి చోట్ల కూడా గెలిచి ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ ఆధిపత్యానికి ప్రమాద ఘంటికలు మోగించింది.
ఇక కాంగ్రెస్ నుంచి మూడు రెడ్లు ఎంపీలుగా గెలవడంతో ఆ పార్టీకి ఊపిరిలూదినట్లయ్యింది. మరో రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ దగ్గరకు వచ్చి ఓడిపోయింది. ఇక కాస్త కష్టపడి ఉంటే మహబూబ్‌నగర్‌లో కూడా పార్టీ మారి బీజేపీ నుంచి పోటీ చేసిన డీకే.అరుణ కూడా గెలిచేది. అప్పుడు టీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలేది. ఈ షాకులు అన్నింటి నుంచి కేసీఆర్ ఇంకా కోలుకునే పరిస్థితి లేదట. ఇక ఈ ఎన్నికల బాధ్యతలు మొత్తం భుజాన వేసుకున్న కేటీఆర్‌కు ఇది నైతికంగా దెబ్బే. ఇదే క్రమంలో తెలంగాణలో హరీష్‌రావు ఫ్యాక్టర్‌పై కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉంటే నిజామాబాద్‌లో కేసీఆర్ కుమార్తె కవిత స్వయంగా ఓడిపోయారు. ఇది కేసీఆర్‌కు పెద్ద దెబ్బ. ఈ న్యూస్ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. కవిత ఓటమికి ఆమె నియోజకవర్గ పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలే కారణమన్న టాక్ కూడా వచ్చింది. ఇదే విషయమై ఆమె కేసీఆర్‌కు కూడా ఎమ్మెల్యే మీద కంప్లెంట్ చేసినట్టు తెలుస్తోంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కవిత దగ్గర ఉండి మరీ తన పార్లమెంటు స్థానం పరిధిలోని అన్ని సీట్లలో గులాబీ జెండా ఎగిరేలా చేసింది.
2014లో పోయిన జగిత్యాల సీటును ఏకంగా 50 వేల పైచిలుకు మెజార్టీతో గెలిపించడంలో ఆమె కృషి సూపర్. ఇక తాజా ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కవితను ఓడించేందుకు తెరవెనక పనిచేసినట్టు ఆమె ప్రధాన ఆరోపణ అట. మరో ఎమ్మెల్యే ఎన్నికలను సీరియస్‌గా తీసుకోలేదన్న టాక్ కూడా ఉంది. ఈ అంశాలన్నింటిని ఆమె చాలా సీరియస్‌గా తీసుకుని కేసీఆర్‌కు చెప్పడంతో ఆయన పోస్టు మార్టమ్ కూడా స్టార్ట్ చేశారట. కేసీఆర్ సీరియస్ అయితే నిజామాబాద్‌లో కొందరి తోకలు కట్ అవ్వొచ్చంటున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా రైతుల దెబ్బ కూడా కవితకు గట్టిగా తగిలిందన్నది నిజం. ఆమె 60 వేలతో ఓడితే అక్కడ పోటీ చేసిన పసుపు రైతులందరికి కలిసి ఏకంగా 95 వేల ఓట్లు వచ్చాయ్. దీనిపై కవిత ఏమని ఆన్సర్ ఇస్తుందో ? చూడాలి.